Begin typing your search above and press return to search.

ప్ర‌జా నేత బొజ్జ‌ల‌కు చంద్ర‌బాబు ఆత్మీయ వీడ్కోలు.. పాడెమోసి.. నివాళుల‌ర్పించి..

By:  Tupaki Desk   |   9 May 2022 2:53 AM GMT
ప్ర‌జా నేత బొజ్జ‌ల‌కు చంద్ర‌బాబు ఆత్మీయ వీడ్కోలు.. పాడెమోసి.. నివాళుల‌ర్పించి..
X
తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుకు గురై.. గ‌త శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో క‌న్నుమూసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్య‌క్రియ‌ల‌కు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హజరయ్యారు. బొజ్జ‌ల పార్థివ దేహాన్ని ఉంచిన‌ పాడెను మోశారు. బొజ్జలకు తుది వీడ్కోలు పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బొజ్జల స్వస్థలం శ్రీకాళహస్తి మండలం, ఊరందూరులో బొజ్జల అంత్యక్రియలు నిర్వహించారు.

ఊరందూరులోని వ్యవసాయ క్షేత్రంలో అశేషంగా తరలి వచ్చిన అభిమానుల మధ్య బొజ్జల అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తుది వి‌డ్కోలు పలికారు. బొజ్జల అంత్యక్రియల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. బొజ్జల సతీమణిని చంద్రబాబు పరామర్శించారు.

ఆప్త మిత్రుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. శ్రీకాళహస్తి ప్రజలు బొజ్జలను ఎన్నటికీ మరువరని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో మంత్రిగా ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. బొజ్జల స్ఫూర్తిని ఆయన కుమారుడు కొనసాగిస్తారని చంద్రబాబు ఆకాంక్షించారు.

బొజ్జ‌ల ప్ర‌స్థానం ఇదీ..

తిరుపతి జిల్లా శ్రీకాశహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామంలో 1949 ఏప్రిల్ 15న బొజ్జల జన్మించారు. శ్రీకాళహస్తి నుంచి 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994,1999,2009,2014 వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 ,2004 మధ్య ఐటీ, రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా పనిచేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. 2014లో ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి గెలుపొందిన బొజ్జల 2014-19 కాలంలోనూ మధ్య మంత్రిగా పనిచేశారు. అలిపిరి బాంబు పేలుడు ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా ఉన్నారు.

చిత్తూరు పై ప‌ట్టు

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో బొజ్జల-గాలి ముద్దు కృష్ణమనాయుడిది మంచి జోడిగా పేరొందారు. 2004-2014 మధ్య తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొజ్జల-గాలి ముద్దు కృష్ణమనాయుడుని "చిత్తూరు బ్రదర్స్" అంటూ పార్టీ నేతలు ఆత్మీయంగా పలకరించేవారు. బొజ్జలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆప్తమిత్రులుగా కొన‌సాగారు. ప‌లువురు నేత‌లు అంత్య‌క్రియ‌ల్లో పాల్గొని బొజ్జ‌ల‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికారు.