Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్‌ ను మాయ చేసేసినట్టే!!

By:  Tupaki Desk   |   19 July 2017 5:22 AM GMT
పవన్ కల్యాణ్‌ ను మాయ చేసేసినట్టే!!
X
‘ఒక నాయకుడు తిరుగుబాటు స్వరం వినిపిస్తూ ఉంటే పిలిచి.. అతడి మీద ఉన్న కేసుల్ని తిరగదోడుతాం అని హెచ్చరిస్తే చాలు’

‘ఒక నాయకుడు అసంతృప్తితో ఉన్నాడని తెలిస్తే.. అతణ్ని పిలిచి ఓ కాంట్రాక్టు కట్టబెడితే చాలు’

‘ఒక నాయకుడు ధిక్కారస్వరంతో ఉన్నాడని తెలిస్తే.. అతడు డిమాండ్ చేసే ప్రజల గురించి కాస్త పట్టించుకుంటే చాలు’

రాజకీయ చాణక్యనీతిలో ఇది చాలా కీలకమైనది. ఎవరిని మాయ చేయడానికి ఏ అస్త్రం ప్రయోగించాలో... తద్వారా.. తన మనుగడకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ.. ఎప్పటికీ ఎదురుకాకుండా పరిస్థితుల్ని నెగ్గుకురావాలో తెలియడం చాలా ముఖ్యమైనది. రాజకీయ చాణక్యంలో చంద్రబాబునాయుడు సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు. అందుకే ఆయన ఇప్పుడు గత ఎన్నికల్లో తెలుగుదేశం గద్దె ఎక్కడానికి కీలకంగా సహకరించి, ఇప్పుడు వారి పాలన మీద కాస్త కినుకగా ఉన్న పవన్ కల్యాణ్ ను సునాయాసంగా మాయచేయగలుగుతున్నారు. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ లేవనెత్తిన ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యను ప్రభుత్వం చాలా సీరియస్ గా పట్టించుకున్నట్లుగా ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నారు.

ఇక్కడ ఒక విషయంలో చంద్రబాబు ‘టైమ్లీ రెస్పాన్స్’ ను గుర్తించాలి. అది బాధితులకు ఉపయోగపడగల టైం కు స్పందించడం కాదు. తనకు ఉపయోగపడగల టైం కు స్పందించడం. అవును మరి. ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయాన్నే తీసుకుంటే.. ఇక్కడి సమస్య గురించి ఈ ఏడాది ప్రారంభంలో పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సర్కారీ నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలంటూ 48 గంటల డెడ్ లైన్ విధించారు. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో పవన్ కల్యాణ్ ఉద్ధానంలో పర్యటించి.. అక్కడి బాధితులకోసం వంద కోట్ల రూపాయలు విడుదల చేయాలని.. మూలకారణాలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ తర్వాత ఏదో మొక్కుబడి చర్యలతో మమ అనిపించింది. ఇప్పుడు మళ్లీ అదే మొక్కుబడి చర్యల గురించే కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ఒక తీర్మానం చేసి.. కాపు ఉద్యమం ఉధృతం కాబోతున్న సమయంలో పవన్ కల్యాణ్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఉద్ధానం సమస్య మీద పవన్ తో భేటీ కావడానికి చంద్రబాబు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఉద్ధానంలో ఆర్వో ప్లాంట్లు - బాధుతలకు పింఛన్లను చంద్రబాబు ప్రకటించి అక్కడితో పవన్ ను సంతృప్తి పరచాలని చూస్తున్నట్లుంది. ముద్రగడ పాదయాత్ర పిలుపు నేపథ్యంలో దానికి కొంత ముందుగా.. పవన్ ద్వారా ప్రభుత్వానికి ఫేవర్ గా మాట్లాడించుకోవడానికి చంద్రబాబు ఇలాంటి ఎత్తుగడలు పన్నుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి చాణక్య వ్యూహాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు పిలవగానే పవన్ కల్యాణ్ మురిసిపోతే మాత్రం.. ఆయన చేసే మాయల ప్రయోగంలో బురిడీ కొట్టినట్లే అని పలువురు విశ్లేషిస్తున్నారు.