Begin typing your search above and press return to search.

సిట్టింగులపై బాబు గరం గరం

By:  Tupaki Desk   |   6 Sept 2018 3:41 PM IST
సిట్టింగులపై బాబు గరం గరం
X
ఎన్నికల సెగ అంతటా రాజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్నటి దాక తన గెలుపై ధీమగానే ఉన్నారు. అయితే ఈ మధ్య జరిపిన సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంత్రుప్తితో ఉన్నట్లు వెల్లడయ్యింది. దాంతో ఆయన శాసన సభ్యులతో భేటీ అయి వారిని నిలదీసినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఎమ్మేల్యేల పనితీరుపై చీవాట్లు పెట్టినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్యేలు గ్రామదర్శిని - గ్రామ వికాసం వంటి కార్యక్రమాలలో పాలుపంచుకోవటం లేదని ఆయన ఆగ్రహించినట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కారణంగా ప్రజలలోకి వెళ్లలేకపోతున్నామని వారిలో కొంత మంది సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.. ఈ సమాధానం విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలపై విరుకుచుకుపడినట్లు తెలుస్తోంది. అందరి జాతకాలు - చిట్టాలు తన దగ్గర ఉన్నాయని రాబోయే ఎన్నికలలో టిక్కెట్టు కావాలంటే వచ్చే నెల రోజుల్లో అన్నీ పనులు పూర్తిచేయాలని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సర్వేలు ఆధరంగా ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీపై ప్రజలలో తీవ్ర అసంత్రుప్తి ఉన్నందున - సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే యోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు సమాచారం. తమ పార్టీపై అవినీతి ఆరోపణలు వస్తున్న కారణంగా రాబోయే ఎన్నికలలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం. అయితే తమ పార్టీలో ఉన్న సినీయర్ నాయకులతో చంద్రబాబు నాయుడకు పొసగటం లేదని వినికిడి. కాంగ్రెస్‌ తో చేతులు కలపడాన్ని కొంతమంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బాహాటంగానే వ్యతిరేకించారు. ఇటువంటి వారిని సర్వేల పేరుతో ఇంటికి పంపి వేయాలని చంద్రబాబు ఆలోచనగా కొంత మంది విశ్లేషకులు అంటున్నారు. దేశంలో తమ పార్టీ ఎంతో క్రమశిక్షణ గల పార్టీ అని అవకాశం వచ్చినప్పుడల్లా డప్పు చరచుకునే చంద్రబాబు నాయుడికి తన ఎమ్మెల్యేలు తనను విమర్శించడం అస్సలు మింగుడుపడడంలేదు. యువతకు ప్రాధన్యం అన్న పేరుతో సినీయర్లను తొలగించి తద్వారా లబ్ది పొందే ఆలోచనలో ఉన్నారని వినికిడి. అంతేకాకుండా తన తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని తన కుమారుడైన నారా లోకేష్‌కు కట్టబెట్టే యోచనలో ఉన్నారు. అయితే పార్టీలోని సీనియర్లు ఉంటే తన పాచిక పారదని, అందుకే సర్వేల పేరుతో సినీయర్లకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.