Begin typing your search above and press return to search.

'తాను తినను తవుడు లేదు గానీ...'

By:  Tupaki Desk   |   3 Feb 2018 4:17 AM GMT
తాను తినను తవుడు లేదు గానీ...
X
‘‘తాను తినను తవుడు లేదుగానీ.. ప్రియురాలికి వడియాలు కావాలన్నానట్ట’’ అని తెలుగు పల్లెటూళ్లలో ఒక మొరటు సామెత వినిపిస్తూ ఉంటుంది. ఎవడో ఒక ప్రబుద్ధుడు - తన ప్రియురాలిని వెంటబెట్టుకుని ఓ పరిచయస్తుల ఇంటికి అతిథిగా వెళ్లాడు. ఆ ఇంట్లో నిజానికి అతడికి ఎలాంటి మర్యాదా గుర్తింపూ లేదు.. కనీసం పూటకు అన్నం పెట్టడం కూడా ఎక్కువే. తనకు పెట్టకపోయినా పర్లేదు గానీ.. తన ప్రియురాలికి మాత్రం మృష్టాన్నభోజనం పెట్టాలని డిమాండ్ చేసాట్ట. తవుడు అంటే.. పశువులకు పెట్టే మేత. ‘‘నీకు పెట్టడానికి తవుడు కూడా లేదు.. ఇంకా నీ ప్రియురాలికి కావాల్సి వచ్చిందా’’ అంటూ ఆ ఇంటివారు కసురుకున్నారట! ఇదీ సామెత కథ!!

బడ్జెట్ విషయంలో మన తెలుగుదేశం నాయకుల స్పందనలు కూడా ఆ సామెతకథను తలపించే మాదిరిగానే ఉన్నాయి. అసలు రాష్ట్రానికి పైసా విదిలించలేదే.. ఇంత ఖర్మ పట్టిందే అని ప్రజలు విలపిస్తోంటే.. నాయకులకు మెట్రో రైలును శాంక్షన్ చేయలేదే అనేదే పెద్ద దిగులుగా ఉంది. చంద్రబాబునాయుడు మంత్రులతో భేటీ నిర్వహించినప్పుడు.. అక్కడి చర్చల గురించి వార్తల రూపంలో బయటకు తెలిసిన అంశాలను బట్టి.. తతిమ్మా అంశాలకు ఎంత ప్రాధాన్యం దక్కిందో తెలియదు గానీ.. మెట్రో రైలు రాలేదే అనే దిగులు మాత్రం నేతలను ముంచేసినట్లు కనిపిస్తోంది. అమరావతి కి మెట్రో రైలు రాలేదే.. అని చంద్రబాబు నాయుడు బాధపడిపోతే.. విశాఖకైనా మెట్రో రైలు ఇచ్చి ఉంటే బాగుండేదే.. అని గంటా శ్రీనివాసరావు కుమిలిపోయారుట.

మామూలు పనుల కంటె మెట్రోరైలు మీద మాత్రం ఈ నేతలకు ఇంత మోజు ఎందుకా? అనే సందేహం సహజంగానే ప్రజలకు కలుగుతుంది కదా! అక్కడే ఉంది మతలబు. మెట్రో రైలు అంటే వందల వేల కోట్ల రూపాయల వ్యవహారం. ఇబ్బడిముబ్బడిగా కాంట్రాక్టు పనులు ఉంటాయి. కాంట్రాక్టు పనులు అనగానే కమిషన్ కటింగులు కూడా ఉంటాయి. అలాంటి కమిషన్లకు ఆశపడే మెట్రో పనులకోసం వీరు ఆరాటపడుతున్నారేమోనని.. అంతకంటె నిజంగా బాధపడవలసిన విధంగానే అనేక అంశాలకు ఎలాంటి కేటాయింపులూ జరగనేలేదని.. ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా నాయకులు స్వార్థ ఆలోచనలను పక్కనపెట్టి రాష్ట్రం గురించి ప్రయత్నించాలని కోరుతున్నారు.