Begin typing your search above and press return to search.

బాబుకు చుక్కలు చూపించిన మాజీ ఎంపీపీ

By:  Tupaki Desk   |   1 March 2017 1:08 PM IST
బాబుకు చుక్కలు చూపించిన మాజీ ఎంపీపీ
X
టీడీపీలో పార్టీని భుజం మీద మోసే సీనియర్ నేతలకు అన్యాయం జరగడం చాలా మామూలే. తాజాగా ఎమ్మెల్సీ టిక్కెట్ల విషయంలోనూ అదే జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడంతో ఆ జిల్లాలోని సీనియిర్ లీడర్ - సంతకవిటి మాజీ ఎంపీపీ అగ్గిమీద గుగ్గిలమైపోయారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ఆయన రెడీ అయిపోయారు కూడా. దాంతో ఆయన్ను బుజ్జగించడానికి మంత్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో చివరకు చంద్రబాబే ఆయనతో మాట్లాడాల్సి వచ్చింది. చంద్రబాబును కూడా ఆయన నిలదీశారని.. ఆయన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకపోయారని.. న్యాయం చేస్తానన్న ఒక్క మాట తప్ప ఇంకేమీ చెప్పలేకపోయారని శ్రీకాకుళం టీడీపీ నేతలు అంటున్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడిన సంతకవిటి మాజీ ఎంపీపీ కోళ్ల అప్పలనాయుడు మంగళవారం రెబెల్‌ గా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రి పరిటాల సునీత - ఎంపీ రామ్మోహన్‌నాయుడు - తెదేపా జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష - ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ లు కలిసి ఆయన్ను బుజ్జగించేందుకు వెళ్లారు.

ఈ సందర్భంగా వారిని కార్యకర్తలు - నాయకులు అడ్డుకుని నిలదీశారు. అప్పలనాయుడు కూడా ఆగ్రహించడంతో మంత్రి సునీత.. ఆయనకు నామినేటెడ్ పదవి వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అయితే.. కార్యకర్తలు ఆ మాటకు ఆగ్రహించి.. ఇప్పుడు చేసినట్లే అన్యాయం చేస్తారని మంత్రికి మొఖం మీదే చెప్పేశారు. దాంతో ఆమె ఒకవేళ అప్పలనాయుడికి పదవి రాకపోతే తాను రాజీనామా చేస్తానని అన్నారు. అయినా శాంతించకపోవడంతో చంద్రబాబుతో ఫోన్ చేయించారు. అప్పలనాయుడు చంద్రబాబుతో కూడా తన అసంతృప్తి వ్యక్తంచేసి చివరకు శాంతించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/