Begin typing your search above and press return to search.

అప్పులు చేసే విషయంలోనూ చంద్రుళ్లు పోటీ పడుతున్నారే

By:  Tupaki Desk   |   20 Feb 2016 10:30 PM GMT
అప్పులు చేసే విషయంలోనూ చంద్రుళ్లు పోటీ పడుతున్నారే
X
రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు చాలానే దగ్గర పోలికలు ఉన్నాయి. ఒకరికి ఒకరు సంబంధం లేనట్లు కనిపించినా.. చూసేందుకు చాలా వైరుధ్యంగా అనిపించినా ఇరువురు చంద్రుళ్లకు చాలా విషయాల్లో దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ ఇద్దరి చంద్రుళ్ల పాలనకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని చెబుతున్నారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఏపీ సర్కారు రూ.14వేల కోట్లు అప్పు చేస్తే.. తాము కూడా తక్కువ తినలేదన్న రీతిలో తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా దాదాపుగా అదే స్థాయిలో అప్పులు చేయటం గమనార్హం. విభజన కారణంగా ఏపీ సర్కారు తీవ్రమైన ఆర్థిక లోటుతో సతమతమవుతూ.. సర్కారు బండిని సజావుగా నడిపేందుకు అవకాశం ఉన్నంత మేర అప్పులు చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. తెలంగాణ పరిస్థితే కాస్త భిన్నం. ఎందుకంటే.. తమది ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. డబ్బుల్లేని ఏపీ సర్కారుతో పోటీ పడుతున్నట్లు అప్పులు చేయటం ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు.

రాష్ట్ర అవసరాల కోసం అప్పులు చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. అనవసరమైన పలు పథకాల అమలు కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్న చంద్రుళ్ల సర్కారు.. మరోవైపు అప్పుల కోసం ఆవురావురమనటం విశేషం. డబ్బులున్న తెలంగాణ రాష్ట్రం అప్పు చేసినా ఫర్లేదు. కానీ.. ఆర్థికంగా ఏ మాత్రం బలంగా లేని ఏపీ సర్కారు అప్పులు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.