Begin typing your search above and press return to search.

ఇద్దరి చంద్రుళ్ల మధ్య తేడా ఎంతంటే..

By:  Tupaki Desk   |   17 July 2016 4:44 AM GMT
ఇద్దరి చంద్రుళ్ల మధ్య తేడా ఎంతంటే..
X
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నేతృత్వం వహించిన సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. మరీ.. సందర్భంగా ఇద్దరు చంద్రుళ్లు ఏం మాట్లాడారు? ఏయే అంశాల్ని ప్రస్తావించారు? లాంటి అంశాల్ని చూస్తే.. ఆసక్తికరంగా అనిపించక మానదు. ఇద్దరి చంద్రుళ్ల ప్రసంగాల్లో కొన్ని అంశాలు కనిపించినా ఇద్దరి మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపించటం గమనార్హం.

కేంద్రం నుంచి సాయం కోరటం.. వివిధ అంశాలకు కేంద్రం దన్నును ఇద్దరు చంద్రుళ్లు కోరుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. తమ మధ్యనున్న పంచాయితీల గురించి చంద్రబాబు మాట వరసకు ప్రస్తావించకుండా ఉంటే.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా.. మిగిలిన రాష్ట్రాలతో తాము ఒప్పందాలు చేసుకుంటూ బాగున్నామని.. ఏపీతోనే తమ పేచీ అంతా అంటూ ఫిర్యాదు బాణాన్ని సంధించారు.

విభజన కారణంగా తాము పూర్తి స్థాయిలో నష్టపోయామని.. విభజన అశాస్త్రీయంగా జరగటంతో తాము పెద్ద ఎత్తున నష్టపోయామని.. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలన్న మాటతోపాటు.. విభజన సందర్భంగా తమకు ఇచ్చిన హామల్ని నెరవేరచాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్ర సాయం గురించి ప్రస్తావించటమే కాదు.. తమ పరిస్థితుల్ని అర్థం చేసుకొని మిగిలిన వారు సహకరించాలన్న మాటను చెప్పారు. విభజన కారణంగా ఏపీ ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ విషయాన్ని అందరూ గుర్తించాలన్న మాటతో పాటు.. అంతర్ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించే అధికారాన్ని కోర్టుల కంటే కూడా అంతర్రాష్ట్ర మండలికి ఇవ్వాలంటూ కేంద్రం చేసిన సిఫార్సుకు తన మద్దతు పలికారు.

ఇదే సమయంలో.. కేసీఆర్ సైతం కేంద్రం అనుసరిస్తున్న కొన్ని విధానాలకు తన మద్దతు పలకటం గమనార్హం. విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ను ఛాన్సలర్లుగా నియమించే విధానానికి స్వస్తి పలకటానికి తాను ఆమోదిస్తున్నట్లుగా కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న మాటను చెప్పిన ఆయన.. న్యాయవ్యవస్థను పునర్ వ్యవస్థీకరించాలని.. కొత్త కోర్టుల ఏర్పాటుకు కొత్తచట్టం తీసుకురావాలన్నారు. అయితే.. కొత్త కోర్టుల ఏర్పాటుకు అయ్యే వ్యయ్యాన్ని కేంద్రమే భరించాలన్న మాట చెప్పారు. అమెరికా తరహాలో అంతర్గత భద్రత ఉండాలని.. నేరాల నియంత్రణకు కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పారు.

ఇద్దరు చంద్రుళ్ల ప్రసంగ పాఠాన్ని చూస్తే.. ఏపీతో తమకున్న పంచాయితీలను కేసీఆర్ మొహమాటం లేకుండా ప్రస్తావించి.. ఏపీ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తే.. విభజన కారణంగా తాము చాలా నష్టపోయామని.. తమను ప్రత్యేకంగా ఆదుకోకుంటే కష్టమని.. అలా ఆదుకోవటానికి కేంద్రం సహకారం అందించాలంటూ మోడీ సర్కారు నుంచి తనకు తగినంత సాయం అందటం లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.