Begin typing your search above and press return to search.

పెడుతున్న ఖర్చేంటి.. వస్తున్న మైలేజేంది?

By:  Tupaki Desk   |   22 Oct 2015 4:05 AM GMT
పెడుతున్న ఖర్చేంటి.. వస్తున్న మైలేజేంది?
X
కొంతమంది కొన్ని చేస్తే ఆ అందం.. చందం వేరుగా ఉంటుంది. భారీ కార్యక్రమాలు ఏమైనా నిర్వహించాలంటే దమ్ము.. ధైర్యంతో పాటు చేయగలిగిన సత్తా కావాలి. అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో పుష్కలం. అదే సమయంలో.. కొంగొత్త కార్యక్రమాలు చేపట్టి.. భావోద్వేగంతో ఊగిపోయేలా చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుంది. తెలంగాణ పిండి పదార్థాలతో.. తినుబండారాలతో ఒక జాతర లాంటి ప్రదర్శన చేయాలని.. తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటికి తెచ్చేందుకు అదొక వాహకంగా ఉపయోగపడుతుందని ఎవరైనా రాజకీయ నేతలకు చెబితే నవ్విపోతారు.

కానీ.. అలాంటి చిత్రమైన పనిని.. ‘‘తెలంగాణ సంబరాలు’’ పేరు మీద నిర్వహించి కార్యక్రమంతో సాంస్కృతికంగా తెలంగాణ సమాజంలో ఒకవిధమైన ఐక్యతా భావం వ్యక్తమైంది. అలాంటి ఎన్నో కార్యక్రమాల అనంతరం.. తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైంది. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారు.

దారి తెన్ను లేకుండా పోతున్న ఏపీ రాష్ట్రానికి ఒక దిశను.. దశను ఏర్పర్చటమే కాదు.. మునిగిపోతున్న నావలా భావిస్తున్న వారికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావటం.. పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా సరికొత్త ఇమేజ్ తేవటం తక్షణ అవసరం.

పెట్టుబడులు పెట్టండని అడిగితే.. మీ దగ్గర పెట్టటానికి అవకాశాలేమి ఉన్నాయని అడిగే వారికి సమాధానంగా.. ఒక భారీ రాజధానిని నిర్మించాలన్న బృహత్ సంకల్పానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. శంకుస్థాపన కార్యక్రమం కోసం ఇంత భారీ ఖర్చు అవసరమా? అని ప్రశ్నించే చాలామందికి కనీస వ్యాపార సూత్రాలు తెలీవన్న విషయం తాజాగా జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమం చూస్తే అర్థం కాక మానదు.

శంకుస్థాపన కార్యక్రమం కానీ జరగకపోతే.. ఏపీ రాష్ట్రానికి.. బ్రిటన్.. బెల్జియం.. వెనిజులా.. బంగ్లాదేశ్.. రువాండ.. బల్గేరియా దేశాల ప్రతినిధులు మాత్రమే కాదు.. జీఎంఆర్.. యస్ బ్యాంక్.. సుమిటో.. వాల్ మార్ట్.. మిట్సుబిషి.. హెచ్ డీఎఫ్ సీ.. వాన్ డా.. ఏషియన్ పెయింట్స్.. లాక్ హీడ్ మార్టిన్.. ఇలా చెప్పుకుంటే ఒకేసారి వందలాది మంది పారిశ్రామికవేత్తలు ఎప్పటికి వచ్చేను?

శంకుస్థాపన కార్యక్రమం కారణంగా కోట్లాది రూపాయిలు ఖర్చు అవుతాయి. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ.. ఆంధ్రుల్లో కసి ఉందని.. వారు తలుచుకుంటే ఏమైనా చేయగలరని.. ఒక భారీ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యతి అన్న విధంగా నిర్వహించగలిగిన సామర్థ్యం ఉందన్న విషయంతో పాటు.. వనరులు.. అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పే అవకాశం శంకుస్థాపన కార్యక్రమం ఇచ్చిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. పెడుతున్న ఖర్చు గురించి వేదన చెందేకన్నా.. పెట్టే ఖర్చుకు వచ్చే లాభం గురించి.. ప్రయోజనం గురించి ఆలోచిస్తే మంచిది.