Begin typing your search above and press return to search.

బాబు.. జగన్ దొందూ దొందూనే

By:  Tupaki Desk   |   13 Aug 2016 11:00 PM IST
బాబు.. జగన్ దొందూ దొందూనే
X
మొరటు మెగుడు.. మొండి పెళ్లాం తరహాలో ఉంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే. ఎవరికి వారు మొండితనంతో వ్యవహరించటంతో అదికార.. విపక్షాల మధ్య ఉండాల్సిన సున్నిత సంబంధాలు లేకుండా పోతున్న పరిస్థితి. దీనికి కారణం ఎవరికి వారు ఎదుటోళ్ల మీద ఫిర్యాదు చేయొచ్చు. కానీ.. సాపేక్షంగా చూస్తే.. దొందూ దొందూ అన్నట్లుగా వీరి వైఖరి కనిపిస్తుంది.

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన విషయంలో పిలుపులు సరిగా లేవంటూ.. చారిత్రక కార్యక్రమానికి వైఎస్ జగన్ డుమ్మా కొట్టటం తెలిసిందే. ఈ వ్యవహారంలో తమ తప్పు లేదంటూ రెండు వర్గాలు సమర్థించుకున్నాయి. ఇద్దరి సంగతి ఎలా ఉన్నా.. ఏపీ ప్రజలు తరతరాలు చెప్పుకునే శంకుస్థాపన కార్యక్రమంలో విపక్ష నేత హాజరు కాలేదన్న అంశమైతే రికార్డు అయిన పరిస్థితి.

తాము ఆహ్వానిస్తే రాలేదని చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. పిలుపుల విషయంలో ఏదైనా జాగ్రత్త తీసుకున్నారా? అంటే లేదనే చెప్పాలి. పుష్కరాలు శుక్రవారం ఉదయం స్టార్ట్ అయితే.. అప్పుడే విపక్ష నేతకు ఆహ్వానం పంపటం అభ్యంతరకరమైన అంశమే. దీనికి ప్రభుత్వం చెబుతున్నదేమంటే.. జగన్ పర్యటనల్లో ఉండటం కారణంగా ఆహ్వానం ఇవ్వలేదని. ఒకవేళ అదే నిజం అనుకుంటే.. పుష్కరాల ముహుర్తం ఇప్పటికిప్పుడేమీ డిసైడ్ చేసింది కాదు కదా. నెలల ముందే నిర్ణయించారు కదా. అలాంటప్పుడు.. అందరి కంటే ముందే జగన్ కు ఆహ్వానం పంపితే ప్రభుత్వం వైపు తప్పు లేకుండా ఉండేది. కానీ.. ఆ విషయాన్ని ఏపీ సర్కారు లైట్ తీసుకోవటం.. పుష్కరాలు దగ్గరకు వచ్చాక జగన్ అందుబాటులోకి లేకపోవటం జరిగిపోయాయి.

దీంతో.. పుష్కరాల ఆహ్వానం విపక్ష నేతకు సకాలంలో అందలేదు. ఇదిలా ఉంటే.. పుష్కర ఆహ్వానంపై కాసింత ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. మంత్రి రావెల ఆహ్వానపత్రానికి చేతికి ఇచ్చిజగన్ ఇంటికి పంపారు. దీంతో జగన్ షెడ్యూల్ గురించి రావెల ఆరా తీశారు. అమలాపురం వెళుతున్న నేపథ్యంలో ఆయన్ను కుదరటం సాధ్యం కాదన్నారు. సరేనన్న రావెల.. రాత్రికి హైదరాబాద్ కు చేరుకున్న విషయాన్ని తెలుసుకొని.. లోటస్ పాండ్ కు వెళ్లారు. అయితే.. ప్రయాణ బడలికతో తాను కలవలేనంటూ రావెలను కలవకుండా జగన్ తిప్పి పంపారు.

ఆహ్వానం పంపటంలో ప్రభుత్వం తప్పు చేసి ఉండొచ్చు.కానీ.. ఆహ్వానాన్ని పట్టుకొని ఇంటికి వచ్చిన మంత్రిని కలవకుండా.. బడలికగా ఉందంటూ ముఖం చాటేయటం సరైనది కాదు. ప్రభుత్వం తప్పు చేసినా.. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా మంత్రిని సాదరంగా ఆహ్వానించి ఆహ్వానం తీసుకొంటూ సరిపోయేది. జరిగిందంతా బయటకు చెప్పినా.. తప్పు ప్రభుత్వం వైపునే ఉండేది తప్పించి జగన్ మీద ఉండేది కాదు. కానీ.. బాబు వ్యవహారశైలికి తగ్గట్లే జగన్ తీరు కూడా ఉండటం చూస్తే.. ఇద్దరూ దొందూ దొందూ అనిపించక మానదు.