Begin typing your search above and press return to search.

బాబు.. మ‌ళ్లీ బీజేపీతో!

By:  Tupaki Desk   |   23 July 2021 11:30 PM GMT
బాబు.. మ‌ళ్లీ బీజేపీతో!
X
2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో చిత్తుగా ప‌రాజ‌యం పాలై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారాన్ని కోల్పోయిన మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి ప్ర‌భుత్వం ఏర్పాటు దిశ‌గా ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్న‌రా? గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న బాబు తిరిగి ఆ పార్టీతోనే చేతులు క‌ల‌ప‌నున్నారా? అంటే రాజ‌కీవ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

బీజేపీతో దోస్తీ కోసం బాబు తెగ క‌ల‌వ‌రిస్తున్నార‌ని క‌మ‌లం అండ ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవ‌చ్చ‌నేది ఆయ‌న న‌మ్మ‌క‌మ‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కానీ కేంద్రంలోని మోడీ, అమిత్ షాల‌కు తిరిగి బాబుతో స్నేహం ఇష్టం లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 2018 త‌ర్వాత బాబు నేరుగా ఈ ఇద్ద‌రినీ టార్గ‌ట్ చేస్తూ వ‌చ్చారు. కేంద్రంలోని బీజేపీని గ‌ద్దె దించేందుకు ప్ర‌తిప‌క్షాల‌తో చేతులు క‌లిపారు. కానీ బీజేపీకి మాతృసంస్థ‌గా ఉన్న ఆర్ఎస్ఎస్ మాత్రం బాబు ప‌ట్ల సానుకూల ధోర‌ణితో ఉన్న‌ట్లు స‌మాచారం.

ఆర్ఎస్ఎస్ మాట ప్ర‌కార‌మే 2014లో మోడీతో చంద్ర‌బాబు జోడీ కుదిరింది. కానీ 2019 నాటికి మోడీ పార్టీని మించి ఎదిగారు. మ‌రోవైపు బాబు కూడా బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్నారు. కానీ 2024 ఎన్నిక‌ల స‌మ‌యానికి ప‌రిస్థితుల్లో చాలా మార్పు వ‌చ్చే వీలుంది. ఇప్ప‌టికే దేశంలో క‌మ‌లానికి వ్య‌తిరేక గాలులు వీస్తున్నాయి. మోడీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. మోడీ, షాల ఆధిప‌త్యం కూడా మునుప‌టిలా సాగ‌ట్లేదు.

అందుకే ఇప్పుడు వాళ్లు కూడా ఆర్ఎస్ఎస్ పెద్ద‌ల మాట వింటున్నారు. ఈ నేప‌థ్యంలో పొత్తుల విష‌యంలో, రాబోయే రాజ‌కీయ ప‌రిణామాల్లో ఆర్ఎస్ఎస్ మాట ఇంత‌కుముందులా చెల్లుబాట‌య్యే అవ‌కాశం ఉంది. ఇప్పుడిదే బాబుకు క‌లిసి రానుంది. ఏపీలో జ‌గ‌న్ అంటే ఆర్ఎస్ఎస్‌కు మంచి అభిప్రాయం లేద‌నే వాద‌న ఉంది. ఆయ‌న క్రైస్త‌వ మ‌త విశ్వాసం క‌లిగిన వారు కావ‌డ‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది.

ఏపీలోనూ దేవాల‌యాల మీద దాడుల ప‌ట్ల ఆర్ఎస్ఎస్ అసంతృప్తితో ఉంది. ఈ ప‌రిణామాల కార‌ణంగా జ‌గ‌న్‌పై ఆర్ఎస్ఎస్‌కు స‌దుద్దేశం లేద‌న‌దే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ప‌రిస్థితుల్లో మారుతున్న జాతీయ రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీలోనూ రాజ‌కీయ వాతావ‌ర‌ణం మారుతోంది. మోడీతో ఢీ కొట్టేందుకు జ‌గ‌న్ చూస్తున్నారు. ఇప్పుడు బాబుకు కావాల్సింది కూడా అదే.

మ‌రోవైపు వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు అన‌ర్హ‌త పిటిష‌న్ మీద చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వెన‌క ఆర్ఎస్ఎస్ పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బాబుతో తిరిగి క‌లిసేందుకు ఆర్ఎస్ఎస్ ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు బాబుకు కూడా కావాల్సింది అదే కాబ‌ట్టి ఆయ‌న కూడా బంధాన్ని ఒప్పుకునే అక‌వాశం ఉంది.