Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను ఆదర్శంగా తీసుకుందామంటున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   29 May 2019 7:51 PM IST
కేసీఆర్‌ ను ఆదర్శంగా తీసుకుందామంటున్న చంద్రబాబు
X
‘‘కేసీఆర్ నా శిష్యుడు. ఆయన గురించి నాకే చెబుతారా..? నా శిష్యుడి తెలివితేటలు నాకు తెలియనివా? నేను మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. అదే.. ఆరోజు నేను ఆయన్ని మంత్రిని చేసుంటే ఈరోజు టీఆర్ఎస్ ఉండేది కాదు’’ గతంలో చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలివి. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన స్వరం పూర్తిగా మారిపోయింది. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలో కేసీఆర్‌తో విభేదించిన చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీఆర్ ఎస్ అధినేతకు చంద్రబాబుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది.

మంగళవారం జరిగిన ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో ‘‘కష్టాలు మరిచిపోయి.. అన్న ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదాం. ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఉద్యోగాన్ని, సినిమాలను వదిలి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుజాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు ఆయన. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’’ అని పేర్కొన్నారు. అంతేకాదు, ఊహించని పరాజయంతో డీలాపడిన తమ్ముళ్లకు చంద్రబాబునాయుడు తన ప్రసంగంతో ఆత్మస్థైర్యం నింపారు. ఎదురు దెబ్బలు తిన్న ఎన్టీఆర్‌ ఎప్పుడూ మనో ధైర్యం కోల్పోలేదు.. అదే స్ఫూర్తితో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం. ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిద్దాం. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు.

ఇక బుధవారం ఆయన తాజా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు - ఎంపీలు - ఇతర ముఖ్య నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని తెలిసింది. ఓటమి నుంచి త్వరగా బయటకు రావాలని పార్టీ నేతలకు సూచించారట చంద్రబాబు. అంతేకాదు, కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్‌ ను ఉద్దేశ్యించి ఆయన పలు కామెంట్లు చేశారని సమాచారం. ‘‘ఒకే ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఒక్కరి నుంచి వందల మందితో పెద్ద పార్టీగా బలపడింది. ఈ కారణంగానే రెండోసారి అధికారంలోకి వచ్చింది. కాబట్టి.. కేసీఆర్ - టీఆర్ ఎస్‌ ను ఆదర్శంగా తీసుకుని మనం కూడా ముందుకు వెళ్దాం’’ అని టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.