Begin typing your search above and press return to search.

టీడీఎల్సీ నేతగా.. చంద్రబాబే - ఎందుకు వెనక్కు తగ్గారు?

By:  Tupaki Desk   |   29 May 2019 7:44 AM GMT
టీడీఎల్సీ నేతగా.. చంద్రబాబే - ఎందుకు వెనక్కు తగ్గారు?
X
తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ విభాగం అధ్యక్షుడిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే మరోసారి ఎన్నికయ్యారు. వరసగా ఐదో పర్యాయం చంద్రబాబు నాయుడు ఈ బాధ్యతను చేపడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ చంద్రబాబు నయాఉడే లెజిస్లేటివ్ విభాగానికి అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ చంద్రబాబే ఆ పదవిని తీసుకుంటున్నారు.

అయితే ఈ సారి మాత్రం తీరు మారుతుందనే అంచనాలున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండరని, ఆ బాధ్యతను పార్టీలోని ఎమ్మెల్యేల్లో మరొకరికి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి.

తన కన్నా వయసులో చాలా చిన్నవారైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూర్చుకుంటే, తను ప్రతిపక్షంలో కూర్చోవడం చంద్రబాబుకు ఇబ్బందికరమైన అంశం. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడూ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడూ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలోనూ కూర్చోవాల్సి వస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ సారి ఆ బాధ్యతలను మరొకరికి అప్పగిస్తారని ప్రచారం జరిగింది.

అయితే ఏమైందో ఏమో కానీ.. ప్రతిపక్షనేత పదవి మరొకరికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు వెనుకడుగు వేశారు. ఆ బాధ్యతను తనే తీసుకున్నారు. దీనికి పలు కారణాలున్నాయనే మాట వినిపిస్తూ ఉంది. పార్టీ అధికారంలో లేనప్పుడు లెజిస్లేటివ్ విభాగం పదవిని వేరొకరికి ఇస్తే వారు పార్టీపై పట్టు సంపాదించుకునే అవకాశం ఉందని, చంద్రబాబు నాయకత్వంపై తిరుగుబాటు రేగే అవకాశం ఉందని చివరకు ఆయనే ఆ పదవిని తీసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.