Begin typing your search above and press return to search.

చంద్రబాబునే నిలదీసిన మిత్రుడు

By:  Tupaki Desk   |   30 May 2021 6:30 AM GMT
చంద్రబాబునే నిలదీసిన మిత్రుడు
X
ఆప్తమిత్రుడు, సీపీఐ కార్యదర్శి నారాయణే చివరకు చంద్రబాబునాయుడును నిలదీశారు. ఏపికి కేంద్రప్రభుత్వం ఏమిచేసిందని అంశాలవారీగా మద్దతివ్వాలని టీడీపీ నిర్ణయించిందంటు నిలదీశారు. ఇటీవలే ముగిసిన రెండురోజుల డిజిటల్ మహానాడులో అంశాలవారీగా కేంద్రప్రభుత్వానికి టీడీపీ మద్దతివ్వాలని తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రానికి మద్దతు అనే అంశమే నిజానికి అసంబద్ధమైనది.

ఎందుకంటే ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ మద్దతే అవసరంలేదు. పోనీ మద్దతుకావాలని బీజేపీ నేతలు కానీ ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు కానీ అడిగాయా అంటే అదీలేదు. పైగా చంద్రబాబుతో పొత్తు కానీ మద్దతు కానీ అవసరమే లేదని ఇప్పటికే బీజేపీ నేతలు చాలాసార్లు చెప్పారు. బీజేపీ వద్దంటున్నా చంద్రబాబే కమలనాదులకు దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఇలాంటి నేపధ్యంలోనే మహానాడు తీర్మానంపై సీపీఐ కార్యదర్శి మండిపోయారు.

ఏ ఏ అంశాల్లో నరేంద్రమోడికి మద్దతివ్వాలని టీడీపీ అనుకుంటోందో చంద్రబాబు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారిని నియంత్రించటంలో విఫలమైనందుకు మోడికి టీడీపీ మద్దతివ్వాలని అనుకుంటోందా అంటు ఎద్దేవా చేశారు. వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమిస్తున్నా పట్టించుకోనందుకా ? ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు మోడికి మద్దతివ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారా అంటూ సూటిగానే నిలదీశారు. కేంద్ర వైఫల్యాలను కూడా టీడీపీ జగన్మోహన్ రెడ్డికే ఆపాదిస్తుంటే నమ్మటానికి జనాలు అమాయకులు కారన్నారు.

రామకృష్ణ తాజా వైఖరి చూసిన తర్వాత భవిష్యత్తులో చంద్రబాబుకు మద్దతిచ్చేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే మొన్నటివరకు బీజేపీ దగ్గరవ్వాలని, కేంద్రానికి మద్దతివ్వాలనే విషయంలో బహిరంగంగా టీడీపీ ఎక్కడా చెప్పలేదు. కాబట్టి టీడీపీ పిలుపిచ్చిన ప్రతి ఆందోళనలోను సీపీఐ రామకృష్ణ మద్దతుగా నిలబడేవారు. కానీ మహానాడులో తీసుకన్న తాజా నిర్ణయంతో ఇకపై సీపీఐ మద్దతు అనుమానమే.