Begin typing your search above and press return to search.

బాబుకు చుక్కలు చూపిస్తున్న తమ్ముళ్లు

By:  Tupaki Desk   |   23 Jan 2019 10:22 AM IST
బాబుకు చుక్కలు చూపిస్తున్న తమ్ముళ్లు
X
30 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకు ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు చుక్కలు చూపిస్తున్నారట.. అన్నేళ్లు రాజకీయాల్లో ఏలిన బాబుకు తలనొప్పులు చూపిస్తున్నారట.. ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాల నుంచి.. నియోజకవర్గాల నుంచి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది.

తాజాగా కడప జిల్లాలో చంద్రబాబుకు షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు రోడ్డున పడ్డారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, శాసనసభ్యుడు మేడా మల్లికార్జున్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. గత ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ నుంచి పోటీచేసి గెలిచింది మేడా మల్లికార్జున్ రెడ్డి ఒక్కరే.. ఈయన తాజాగా టీడీపీ వదిలి వైసీపీలో చేరడంతో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు.

అనంతపురంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి టీడీపీ నేతలకు అస్సలు పడడం లేదు. పార్టీకి తలవంపులు తెస్తున్నాడంటూ జేసీపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుల చేష్టలతో టీడీపీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక విశాఖ జిల్లాలో మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇది విశాఖలో పార్టీ పుట్టి మునిగేలా చేస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చింతమనేనిని మార్చాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. దీంతో ఎక్కడ చూసినా టీడీపీ నేతలపై వ్యతిరేకత పెల్లుబుకడం.. అధినేత చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వారిపై బాబుకు కంట్రోల్ లేకపోవడంతో పార్టీ పుట్టి మునిగేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.