Begin typing your search above and press return to search.

పెద్దాయన బ్లెస్సింగ్స్ : పీవీకి బాబు నివాళి ఆసక్తికరమేనా...?

By:  Tupaki Desk   |   29 Jun 2022 5:26 AM GMT
పెద్దాయన బ్లెస్సింగ్స్  :  పీవీకి బాబు నివాళి ఆసక్తికరమేనా...?
X
తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు దివంగత నేత, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 101 జయంతి వేడుకలను తాజాగా తన టీడీపీ ఆఫీసులో జరిపారు. ఈ సందర్భంగా ఆయన ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. పీవీని మేటి ఘనాపాఠి అని కూడా కీర్తించారు. ఒక విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పీవీని సంస్మరించడం ఆసక్తిని కలిగించే విషయం. పీవీ అంటే బాబుకు చాలానే అభిమానం ఉంది అని చెప్పాలిక్కడ. దానికి కారణం ఆయన మొదట రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే కాబట్టి.

అప్పటికే పీవీ జాతీయ రాజకీయల వైపు చూస్తున్నారు. చంద్రబాబు ఫస్ట్ టై, ఎమ్మెల్యే అయిన వేళ ఆయన ఢిల్లీ బాటన పట్టి ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో మంత్రిగా కూడా బాబు పనిచేశారు. అలా పీవీతో అప్పట్లోనే కొద్దిపాటు పరిచయం ఉంది. సీన్ కట్ చేస్తే చంద్రబాబు కాంగ్రెస్ ని వీడి టీడీపీలోకి వచ్చారు. అలా 1984లో టీడీపీలో ప్రవేశించిన చంద్రబాబు పదకొండేళ్ళు తిరగకుండానే అదే పార్టీకి ప్రెసిడెంట్ అయ్యారు. ఎన్టీయార్ జీవించి ఉండగానే ఆయనను పక్కకు తోసి సీఎం అయిపోయారు.

ఇదంతా 1995లో జరిగింది. ఆనాటికి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నారు. ఇక 1995 ఆగస్టులో ఏపీలో రాజకీయ సంక్షోభం రగిలినపుడు సహజంగానే కేంద్రం ఈ వైపు చూసింది. అయితే కాంగ్రెస్ కి నాటి ఉమ్మడి ఏపీలో కేవలం 26 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇక మొత్తానికి మొత్తం ఊడ్చేసి ఎన్టీయార్ సీఎం అయిన సందర్భం అది.

ఎన్టీయార్ మీద చిన్నల్లుడు చంద్రబాబు తిరుగుబాటు చేసినపుడు కేంద్రం ఈ పరిణామాలను ఆసక్తిగా గమనించింది కానీ ఏ దశలోనూ అస‌లు జోక్యం చేసుకోలేదు. దానికి పీవీ అనుసరించిన తటస్థ వైఖరి కారణం అంటారు. అది పూర్తిగా టీడీపీ సొంత పార్టీ వ్యవహారం కంటే కూడా మామా అల్లుళ్ళు, కుటుంబం వ్యవహారం అని పీవీ భావించి అలా ఊరుకున్నారు అని చెబుతారు.

ఇక్కడ మరో ముచ్చటను కూడా చెప్పుకోవాలి. ఎన్టీయార్ సీఎం అయ్యాక 1995 ఏప్రిల్ లో వచ్చిన ఉగాది వేడుకకు తన ఇంటికి తెలుగు ప్రధాని అయిన పీవీని ఆహ్వానించి అతిధి మర్యాదలు చేశారు. పీవీ కాంగ్రెస్ ప్రధాని అయినా తెలుగు వారు అన్న గౌరవంతో ఎన్టీయార్ ఇదంతా చేశారు. దానికంటే ముందు 1991లో నంద్యాల నుంచి పీవీ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ పోటీ నిలపకుండా సాటి తెలుగు వాడు ప్రధాని కావాలి అని సహకరించింది. అది కూడా ఎన్టీయార్ తీసుకున్న నిర్ణయమే.

నాడు ఉగాది వేడుకకు ఎన్టీయార్ ఇంటికి వచ్చిన ప్రధాని పీవీని ఎన్టీయార్ లక్ష్మీ పార్వతి దంపతులు సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. ఇక అది జరిగిన నాలుగు నెలలకే ఎన్టీయార్ సర్కార్ సంక్షోభంలో పడింది. అపుడు ఎన్టీయార్ నేరుగా పీవీతో మాట్లాడారు అని చెబుతారు. పీవీని ఈ కీలక సమయంలో ఆదుకోమని ఆయన కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పీవీ మాత్రం ఈ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. ఆయన ఏం జరిగితే అది జరగనీ అని వదిలేశారు అని అంటారు.

నాడు కనుక పీవీ జోక్యం చేసుకుని ఉంటే నాటి ఏపీ గవర్నర్ క్రిష్ణకాంత్ ఎన్టీయార్ నుంచి అంత తొందరగా రాజీనామా లేఖ తీసుకుని ఉండేవారు కాదు అని చెబుతారు. మొత్తానికి బాబు 1995 సెప్టెంబర్ 1న సీఎం గా ప్రమాణం చేయడానికి ఒక విధంగా పీవీ జోక్యం చేసుకోకుండా ఉండడం బాగా ఉపకరించింది అని చరిత్ర చెప్పే సత్యం. అందుకే పీవీ అంటే కాంగ్రెస్ వారి కంటే కూడా ఒక రవ్వ ఎక్కువ అభిమానమే బాబుకు ఉండితీరాలి. ఆయన సీఎం కోరికను ఒక విధంగా పీవీ నెరవేర్చారు అని కూడా ఇక్కడ చెప్పుకున్నా తప్పులేదు.