Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు, జ‌గ‌న్ మ‌రోమారు ఎవ‌రికి వారే య‌మునా తీరే!

By:  Tupaki Desk   |   20 Aug 2022 9:45 AM GMT
చంద్ర‌బాబు, జ‌గ‌న్ మ‌రోమారు ఎవ‌రికి వారే య‌మునా తీరే!
X
సాధార‌ణ ప్ర‌జ‌లు బాధ‌ప‌డేలా ఏపీ రాజ‌కీయాలు మారిపోయాయి. ఒక‌ప్పుడు అధికార, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య కేవ‌లం రాజ‌కీయ ప‌ర‌మైన విమ‌ర్శ‌లు మాత్ర‌మే ఉండేవి. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు అస్స‌లు ఉండేవి కావు. ప్ర‌తిప‌క్షాలు కూడా ప్ర‌జా స‌మస్య‌ల కోణంలోనే ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శించేవి. ప్ర‌భుత్వాలు కూడా ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేవి. ఇక ఏవైనా పెళ్లిళ్లు, ఇత‌ర ఫంక్ష‌న్ల‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య న‌మ‌స్కారాలు, ప్ర‌తి న‌మ‌స్కారాలు, స‌ర‌దా సంభాష‌ణ‌లు చోటు చేసుకునేవి. మీడియాకి కూడా కావాల్సినంత స్ట‌ఫ్ దొరికేది.

అయితే గ‌త కొంత‌కాలంగా ఏపీ రాజ‌కీయాలు పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టిపోయాయ‌ని ప్ర‌జ‌లు ఆవేదన చెందుతున్నారు. ఆగ‌ర్భ శ‌త్రువుల్లా అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఏ ఒక్క‌రికీ న‌చ్చ‌డం లేదు. ఒక‌ప్పుడు త‌మిళ‌నాడులో ఇలాంటి క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు ఉండేవి. అవి ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌వేశించాయ‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. రాజ‌కీయ‌ప‌ర‌మైన విమ‌ర్శ‌లు దాటి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసుకునేవ‌ర‌కు, చివ‌ర‌కు ఇంట్లోని మ‌హిళ‌ల‌ను సైతం లాగి అల్ల‌రి చేసేవ‌ర‌కు ఏపీలో రాజ‌కీయాలు కొన‌సాగుతుండ‌టం స‌గటు సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను కూడా క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంద‌ని అంటున్నారు.

తాజాగా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ విజ‌య‌వాడ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ‌లో కోర్టుల భ‌వ‌న స‌ముదాయాన్ని ఆయ‌న ప్రారంభించారు. అలాగే గుంటూరు ఆచార్య‌ నాగార్జున యూనివ‌ర్సిటీలో డాక్ట‌రేట్ తీసుకోనున్నారు. ఇందుకోసం విజ‌య‌వాడ నోవాటెల్ హోట‌ల్ లో బ‌స చేసిన సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌లిశారు. అటూఇటుగా అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు కూడా ర‌మ‌ణ‌తో భేటీని నోవాటెల్ కు వ‌చ్చారు. అయితే అక్క‌డ ఇద్ద‌రు నేత‌లు క‌నీసం ప‌ల‌క‌రించుకోలేద‌ని అంటున్నారు.

ఆగ‌స్టు 15న గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ రాజ్‌భ‌వ‌న్ లో నిర్వ‌హించిన ఎట్ హోమ్ కార్య‌క్ర‌మానికి కూడా సీఎం జ‌గ‌న్, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు హాజ‌రైనా క‌నీస ప‌ల‌కరింపులు చోటు చేసుకోని సంగ‌తి తెలిసిందే. ఎవ‌రికి వారు.. యమునా తీరే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌తో భేటీ సంద‌ర్భంగానూ ఇదే సీన్ రిపీట‌య్యింద‌ని అంటున్నారు.విజయవాడ నోవాటెల్ లో సీజేఐ ఎన్వీ రమణను క‌లిసేందుకు సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ వేర్వేరుగా వచ్చారు. ముందు సీఎం జగన్ వెళ్లి ఎన్వీ రమణను కలిసి మాట్లాడారు. అనంతరం చంద్రబాబు కూడా వెళ్లి రమణతో భేటీ అయ్యారు.

అటు చంద్ర‌బాబు, ఇటు జ‌గ‌న్ ఏక‌కాలంలో అటూ ఇటుగా ఒకే స‌మ‌యంలో సీజేఐ ఎన్వీ రమ‌ణ‌ను క‌లిసేందుకు రావ‌డంతో వీరిద్దరూ సీజేఐని కలిసేందుకు పోలీసులు, ప్రోటోకాల్ అధికారులు ఏర్పాట్లు చేయ‌డంలో తంటాలు ప‌డ్డార‌ని చెబుతున్నారు.

నోవోటెల్ హోటల్ కు వచ్చిన సీఎం జగన్ ను సెల్లార్ మార్గం ద్వారా వెళ్లి సీజేఐ ఎన్వీ రమణను కలిసి అదే మార్గంలో తిరిగి వెళ్లిపోయేలా పోలీసులు చేశార‌ని చెబుతున్నారు. అలాగే అదే సమయంలో వచ్చిన చంద్రబాబు ను నోవోటెల్ హోటల్ ప్రధాన ద్వారం పోర్టుకో ద్వారా వెళ్లి ఎన్వీ ర‌మ‌ణ‌ను కలిసి తిరిగి వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశార‌ని అంటున్నారు.

కాగా సీఎం జగన్ త‌న‌ సతీమణి భార‌తిరెడ్డితో వెళ్లి ఎన్వీ రమణను కలిశారు. ఆయనతో 20 నిమిషాల పాటు స‌మావేశ‌మయ్యారు. ఆ తరువాత వెంటనే అంటే జగన్ వెళ్లీ వెళ్లక ముందే చంద్రబాబు అక్కడకు చేరుకున్నార‌ని స‌మాచారం. చంద్రబాబు సైతం 20 నిమిషాల సేపు జస్టిస్ రమణతో సమావేశమయ్యార‌ని తెలుస్తోంది. చంద్రబాబు వెంట ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడు ఉన్నారు.