Begin typing your search above and press return to search.

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు చంద్రహాసం...?

By:  Tupaki Desk   |   4 March 2022 8:30 AM GMT
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు చంద్రహాసం...?
X
పున్నమి చంద్రుడు ఎవరికైనా ఇష్టమే. పచ్చగా విరగబూస్తూ నింగిని అంతా తన వెన్నెల కాంతులతో పరచేస్తాడు. ఇక రాజకీయ చంద్రుడు చంద్రబాబు కూడా నవ్వితే చూడాలన్నది చాలా మంది కోరిక. ఆయన ఎపుడూ సీరియస్ గానే ఉంటారు. నిజానికి బాబు సీరియస్ పొలిటీషియన్. ప్రతీ చిన్న విషయాన్ని ఆయన తీవ్రంగానే ఆలోచిస్తారు. అందుకే ఆయన ఫేస్ మీద ఆ సీరియస్ నెస్ అలా ఎపుడూ ఉంటుంది. ఆయన నవ్వితే మాత్రం అది పెద్ద పండుగే అవుతుంది. అలాంటి చంద్రబాబు దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ముఖానంతా నవ్వుగా చేసుకున్నారు. ఆయన ముఖంలో ఆనందం ఎక్కడా దాచుకోలేనంతగా బయటకు తన్నుకువచ్చింది.

అమరావతి రాజధాని పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద‌ బాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని కవరేజ్ చేసిన టీవీలన్నింటిలో చంద్ర వెన్నెలలు అలా ఒక్కసారిగా పరచుకున్నాయి. మొత్తానికి అది చంద్రహాసమే. అవధులు లేని ఆనందమే. చంద్రబాబుకు ఎక్కడ లేని సంతోషం ఎందుకు వచ్చింది. ఆయన కూడా దాచడానికి వీలులేనంతగా ఆనంద భావాలు ముఖాన ప్రస్పుటంగా ఎలా కనిపించగలిగాయి.

అంటే అక్కడే ఉంది జవాబు. అది అవధులు లేని ఆనందం. హద్దులు లేని సంతోషం. అదంతా అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఫలితం అన్న మాట. నిజంగా చంద్రబాబుకు ఈ తీర్పు కోటి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. గత మూడేళ్ళుగా చూస్తే టీడీపీకి అన్నీ ప్రతికూలమే. అంతటా వ్యతిరేకమే. అలా దెబ్బలు తింటూ పడుతూ లేస్తున్న టీడీపీ రధానికి ఇక ఎదురులేదని చెప్పే వార్త అది.

చంద్రబాబు బంగారు స్వప్నానికి అది పూలబాట లాంటి వార్త. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా సృష్టించిన అమరావతి రాజధానికి ఇక ఏ అడ్డూ లేదని తెలియచేసే అద్భ్తుతమైన సమాచారం అది. ఒక విధంగా అమరావతి గెలిచింది అంటే చంద్రబాబు గెలిచినట్లే. చంద్రబాబు రాజకీయం అంతా అమరావతితోనే ముడిపడి ఉంది. ఆయన కూడా అలాగే దాన్ని జాగ్రత్తగా నిర్మించుకుంటూ వచ్చారు.

సరిగ్గా అక్కడే అడ్డుకట్ట వేయాలని, బాబు స్వప్న సౌధానికి బీటలు వార్చేలా చేయాలని వైసీపీ వేసిన ఎత్తుగడలు అన్నీ న్యాయం ముందు వీగిపోయాయి. నిజానికి అమరావతి విజయం బాబుకు వ్యతిగతంగా చూస్తే ఎంతో గుండె ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పాలి. బాబుని నమ్మి వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు మూడేళ్ళుగా కడగండ్లు పడ్డారు. వారికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఒక వైపు. మరో వైపు రియల్ ఎస్టేట్ దందా అక్కడ జరిగింది అని పెద్ద ఎత్తున ఆరోపణలతో రాజకీయ మచ్చను తెచ్చే వైనాలు. ఇంకో వైపు చూస్తే బాబుకు ఉన్న దార్శనికుడు అన్న బిరుదుకు చెదలు పట్టించాలని చూసిన వైనాలు. ఇలా ఒక్క అమరావతి చుట్టూ ఎన్నో జరిగాయి.

అయినా బాబు ఏ రోజూ నిబ్బరం కోల్పోలేదు. మనదే విజయం అంటూ ముందుకు సాగారు. ఆ రోజు రానే వచ్చింది. బాబు కలలు సాకారం అయ్యే పరిస్థితిని కూడా తెచ్చింది. ఒక విధంగా బాబు పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా అమరావతి రాజధాని ఉంటుంది. ఎందరో ముఖ్యమంత్రులు వస్తారు, వెళ్తారు. కానీ రాజధానులు నిర్మించే చాన్స్ ఒక్కరికే వస్తుంది.

అలా బాబుకు అవకాశం వచ్చింది.అది మధ్యలో బ్రేక్ పడేందుకు యత్నాలు జరిగినా చివరికి బాబు గెలిచారు. ఆయన మరోసారి గెలిచి సీఎం కావచ్చు. మరిన్ని ఏళ్ళు పాలించవచ్చు కూడా. కానీ వేటికీ రాని పేరు, కీర్తి ఒక్క అమరావతి రాజధానితోనే బాబుకు శాశ్వతం అవుతుంది. అమరావతి రాజధానిగా ఉన్నంతకాలం బాబు పేరు కూడా అలా వినిపిస్తూ ఉంటుంది. బహుశా ఇవన్నీ మదిలో ఒక్కసారిగా కదలబట్టే చంద్రబాబు ముఖంలో నవ్వు వికసించింది. ఆ చంద్రహాసాన్ని ఏపీ మొత్తం ఆసక్తిగా చూసింది.