Begin typing your search above and press return to search.

డీజీపీ లేఖ రాయటంపై మండిపోయిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   30 Sept 2020 11:15 AM IST
డీజీపీ లేఖ రాయటంపై మండిపోయిన చంద్రబాబు
X
’డీజీపీ నాకు లేఖ రాయటం ఏమిటి’ ? ఇది డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యవహార శైలిపై చంద్రబాబునాయుడు తాజా ఆగ్రహం. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో సస్పెన్షన్లో ఉన్న జస్టిస్ రామకృష్ణ సోదరుడు రామచంద్రపై నాలుగు రోజుల క్రితం దాడి జరిగింది. దాడి విషయం వెలుగు చూడగానే చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలు వెంటనే రియాక్టయిపోయారు. వైసిపి గుండాలే దళితుడైన రామచంద్రపై దాడి చేసి గాయపరిచారంటూ ఆరోపణలు చేశారు. జరిగిన దాడి ఘటనపై పోలీసులు వెంటనే సీరియస్ గా స్పందించి విచారణ చేయాలంటూ డీజీపీకి చంద్రబాబు ఓ లేఖ రాశారు.

చంద్రబాబు తన లేఖలో దాడికి వైసిపి శ్రేణులే కారణమని స్పష్టంగా చెప్పారు. లేఖలో ఆరోపణలు చేశారు కాబట్టి డీజీపీ కూడా చంద్రబాబుకు తిరిగి ఓ లేఖను రాశారు. తన లేఖలో చంద్రబాబు ఆరోపణలకు ఏమన్నా ఆధారాలుంటే ఇవ్వాలంటూ కోరారు. దాంతో చంద్రబాబుకు ఒళ్ళుమండిపోయింది. డీజీపీ తనకు లేఖ రాయటం ఏమిటి ? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. తాను వాళ్ళకు ఆధారాలను ఇస్తే పోలీసులు దర్వాప్తు చేయటం ఏమిటంటూ మండిపోయారు.

జరిగిన ఘటనపై తానే పోలీసులకు ఆధారాలను ఇస్తే ఇక పోలీసులేమి చేస్తారు ? పోలీసులున్నది ఎందుకు ? దర్యాప్తు చేయాల్సింది పోలీసులా ? లేకపోతే ప్రతిపక్షమా ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉంది కానీ చంద్రబాబు ఇక్కడ ఓ లాజిక్ మరచిపోయారు. జరిగిన ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి దర్వాప్తు జరపాలని డిమాండ్ చేయటంలో తప్పేలేదు. దాడిచేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోమని అడగటంలో కూడా తప్పులేదు. కానీ తన లేఖలో దాడిచేసింది వైసిపి వాళ్ళే అని ఆరోపించటంలోనే సమస్యుంది.

ఏ ఆధారాలతో దాడి చేసింది వైసిపి వాళ్ళే అని చంద్రబాబు ఆరోపణలు చేశారన్నదే అసలైన ప్రశ్న. అందుకనే చేసిన ఆరోపణలకు ఏమైనా ఆధారాలుంటే ఇవ్వమని చంద్రబాబుకు డీజీపీ లేఖ రాశారు. ఇందులో డీజీపీని తప్పు పట్టాల్సిందేముంది ? తమ దగ్గర ఆధారాలుంటే డీజీపీకి చంద్రబాబు ఇవ్వాలి, లేదంటే లేదని చెప్పాలి. దాడి ఘటనపై చంద్రబాబు దగ్గరున్న ఆధారాలను పరిగణలోకి తీసుకోవాలని డీజీపీ అనుకోవటంలో తప్పేమీలేదు. ఇంతోటి దానికి తనకు అసలు డీజీపీ లేఖనే రాయకూడదన్నట్లుగా చంద్రబాబు ఆక్షేపించటంలో అంతరార్ధం ఏమిటి ?