Begin typing your search above and press return to search.

జ‌మిలి వెనుక బాబు ఆలోచ‌న‌.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   3 Oct 2020 3:00 PM GMT
జ‌మిలి వెనుక బాబు ఆలోచ‌న‌.. రీజ‌నేంటి?
X
`2022లో జ‌మిలి ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌‌మ‌త్తంగా ఉండాలి. ``- ఇదీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా పేల్చిన బాంబు. మ‌రి ఇది నిజ‌మేనా? చంద్ర‌బాబు చెప్పినట్టు మ‌రో ఏడాదిలో దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు వ‌స్తాయా? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. దీనిపై కొంత ఆలోచ‌న చేస్తే.. నిజానికి జ‌మిలి ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఫిఫ్టీ ఫిఫ్టీగానే క‌నిపిస్తోంది. ఎందుకంటే.. ఈ నెల‌లోనే బిహార్ రాష్ట్ర ఎన్నిక‌లు ఉన్నాయి. మ‌రికొన్ని నెల‌ల వ్య‌వ‌ధిలో త‌మిళ‌నాడు ఎన్నిక‌లు, ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు కూడా ఉన్నాయి.

ఒక వేళ కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం క‌నుక జ‌మిలి ఎన్నిక‌ల దిశ‌గా అడుగులు వేసే ఉద్దేశం ఉంటే.. ఇప్పుడు ఆయా రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల కోసం సిద్ధ‌మ‌య్యే ప‌రిస్థితి ఉండ‌దు. కానీ, చంద్ర‌బాబు వంటి సీనియ‌ర్ నాయ‌కుడు ఇప్పుడు జ‌మిలి మంత్రం ప‌ఠించ‌డం వెనుక రాజ‌కీయంగా వ్యూహం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. బొత్తిగా తిని తొంగుంటే.. అన్న‌ట్టుగా కాకుండా సాధార‌ణ ప్ర‌జ‌లైనా.. పొలిటిక‌ల్ నాయ‌కులైనా.. ఏదో ఒక బూమ్ ఉండాల్సిందే. నిత్యం ఏదో ర‌కంగా ప్ర‌జ‌ల్లో మ‌మేకం కావాలి. దీనికి సంబంధించి ఏదో ఒక వ్యూహం కూడా ఉండాలి.

ఈ క్ర‌మంలోనే తాజాగా చంద్ర‌బాబు పార్టీలో నైరాశ్యాన్ని తొల‌గించేందుకు పార్టీలో త‌మ్ముళ్లను పోటాపోటీ గా రంగంలోకి దింపేందుకు ఈ అస్త్రం వినియోగించి ఉంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందున్న ప‌రిస్థితి ఇప్పుడు టీడీపీలో క‌నిపించాలంటే.. త‌మ్ముళ్లు చురుగ్గా వ్య‌వ‌హ‌రించా లంటే.. ఖ‌చ్చితంగాఏదో ఒక వ్యూహం ఉండాల్సిందే. ఆ దిశ‌గానే చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. తొలి అడుగుగా.. ఆయ‌న పార్టీ నేత‌ల మ‌ధ్య ఉన్న దూరాన్ని త‌గ్గించేందుకు ప్రాధాన్యం ఇస్తూ... పార్ల‌మెంట‌రీ జిల్లా ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.

మ‌హిళా నేత‌ల‌కు కూడా ఊహించ‌ని ప‌ద‌వులు ఇచ్చి శాంతింప‌జేశారు. మ‌రి వీరిని నియోజ‌క‌వ‌ర్గాల్లో వినియోగించుకుని, పార్టీని నిల‌బెట్టుకునేందుకు వ్యూహాత్మ‌కంగా వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావించిన చంద్ర‌బాబు.. ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నార‌ని.. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న జ‌మిలి ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నార‌ని, దీంతో పార్టీ ప‌రంగా నాయ‌కులు.. నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప‌ట్టు సాధించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు పరిశీల‌కులు. మ‌రి చంద్ర‌బాబు వేసిన వ్యూహం బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. స‌క్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.