Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో న‌టికి కూడా జాతి వివ‌క్ష‌

By:  Tupaki Desk   |   10 July 2020 11:30 AM IST
ఆస్ట్రేలియాలో న‌టికి కూడా జాతి వివ‌క్ష‌
X
ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో జాతి వివ‌క్ష ఉద్య‌మం తీవ్రంగా న‌డుస్తోంది. జాతియ‌త‌ను జాతిగా పిలుచుకుంటాం. స్థానికంగా అయితే జాతి అంటే ఒక వ‌ర్గంగా భావిస్తాం. అదే ఇత‌ర దేశాల్లో జాతి అనేది దేశంగా పేర్కొంటారు. ఆ విధంగా ఆయా దేశాల్లో ఇత‌ర దేశాల వారిని అవమానించ‌డం.. వేధింపుల‌కు పాల్ప‌డ‌డం.. వివ‌క్ష చూప‌డం వంటివ‌న్నీ జాతి వివ‌క్ష‌గా చెబుతారు. అలాంటి వివ‌క్ష‌ను భార‌తీయులు ఎప్ప‌టి నుంచో ఎదుర్కొంటున్నారు. నాడు మ‌హ‌త్మాగాంధీ మొద‌లుకుని నేటి అమితాబ్ బ‌చ్చ‌న్ వ‌ర‌కు జాతి వివ‌క్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా ఓ న‌టి కూడా జాతి వివ‌క్ష‌ను ఎదుర్కొన్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించి ఆవేద‌న చెందారు.

"సంజీవ‌ని" వెబ్‌సిరీస్ న‌టి.. మ‌న తెలుగులో వ‌చ్చిన దిక్సూచి సినిమా హీరోయిన్ చాందిని భ‌గ్వ‌నాని లాక్‌డౌన్ తో ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయింది. ఈ సంద‌ర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటూ ఆమె ఆ దేశంలో తిరుగుతోంది. అయితే కొత్త ప్రాంతంలో ఏమీ తెలియ‌వు కాబ‌ట్టి.. కంగారు ప‌డిందంట‌. ఆమె ఒక‌సారి మెల్‌బోర్న్ నుంచి ఓ ప్ర‌దేశానికి వెళ్లేందుకు బ‌స్సు ఎక్కింది. అయితే అక్క‌డికి వెళ్లడం ఆమెకు అదే తొలిసారి. బ‌స్సు చాలా మ‌లుపులు తీసుకుంటూ వెళ్తోంది. దీంతో ఆమె వెళ్లాల్సిన ప్రాంతం తెలియ‌క కంగారుప‌డింది. ఆమె డ్రైవ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి ఇది తాను వెళ్లాల్సిన ప్రాంతానికి వెళ్తుందా? అని అడిగింది. అయితే అతడు స‌మాధానం ఇవ్వ‌లేదు. త‌ర్వాత తోటి ప్ర‌యాణికులను అడ‌గ్గా వారు స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదు.

దీంతో భ‌య‌ప‌డిన చాందిని మ‌రోసారి డ్రైవ‌ర్‌ను కొంత ఆగ్ర‌హంతో వివ‌రాలు అడిగింది. దీనికి ఆ డ్రైవ‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. కోపంతో క‌సురుగా ఆమెను వెళ్లిపొమ్మ‌ని హెచ్చ‌రించాడు. తాను చాలా మ‌ర్యాద‌గా అడిగాను కానీ అతడు వెళ్లిపొమ్మంటూ అరుస్తూనే ఉన్నాడని చాందిని సోష‌ల్ మీడియాలో తెలిపింది. ఈ సంద‌ర్భంగా చెత్త భార‌తీయుల్లారా.. ఇక్క‌డి నుంచి వెళ్లిపొండి' అని బూతులు మాట్లాడాడని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈ ఘ‌టన‌‌తో ఒక్క‌సారిగా షాక్ త‌గిలింద‌ని.. అత‌డిపై ఎలా స్పందించాలో, అప్పుడు ఏం చేయాల‌నేది తోచ‌లేదని పేర్కొంది. ఆ స‌మ‌యంలో వ‌ణుకుతూనే బ‌స్సు దిగిపోయానని వివ‌రించింది. జాతి వి‌వ‌క్ష ఇంకా ఉంది అన‌డానికి త‌న‌కు జ‌రిగిన ఈ అనుభ‌వ‌మే నిద‌ర్శ‌నం అని చాందిని తెలిపింది.