Begin typing your search above and press return to search.

అంధకారంలో ఛండీగఢ్.. వైద్య సేవలకు అంతరాయం..!

By:  Tupaki Desk   |   23 Feb 2022 11:30 AM GMT
అంధకారంలో ఛండీగఢ్.. వైద్య సేవలకు అంతరాయం..!
X
కేంద్ర పాలిత ప్రాంతం ఛండీగఢ్ లో విద్యుత్ సేవలు స్తంభించాయి. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 36 గంటల నుంచి అక్కడి ప్రజలు అంధకారంలోనే మగ్గుతున్నారు. కరెంటు లేకపోవడంతో నీటి సరఫరాకు ఇబ్బందులు వచ్చాయి.

అంతే కాకుండా వైద్య సేవలకు కూడా తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. ఇప్పటికి కొన్ని ప్రాంతాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. కరెంట్ డిపార్ట్మెంట్ సమ్మె వల్ల అక్కడ విద్యుత్ సేవలకు బ్రేక్ పడింది.

కరెంట్ డిపార్ట్మెంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దానిని అక్కడి విద్యుత్ శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ ను ప్రైవేటీకరణ చేయడాన్ని సహించేది లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు నిరసిస్తూ... విద్యుత్ సేవలు నిలిపివేశారు. సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దాదాపు 36 గంటలపాటు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడ్డారు.

కరెంటు లేకపోవడంతో ఆస్పత్రుల్లోని పలు సేవలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. కొన్ని శస్త్ర చికిత్సలు కూడా వాయిదా వేసినట్లు వివిధ ఆస్పత్రుల వర్గాలు వెల్లడించాయి. అత్యవసర కేసులు జనరేటర్ సాయంతో చికిత్స అందించామని పేర్కొన్నాయి. మరోవైపు ట్రాఫిక్ లైట్లు కూడా వెలగలేదు. ఇళ్లన్నీ అంధకారంలో మగ్గి పోయాయి. మంచినీటి సరఫరా నిలిచిపోయింది. సెల్ ఫోన్లలోని ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇటీవల కాలంలో మనిషి జీవితంలో ఫోన్ భాగం అయింది. ఈ నేపథ్యంలో ఫోన్ లేకుండా జనం ఉండలేకపోతున్నారు. ఫోన్ల కు అతుక్కుపోయే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఛండీగఢ్ అంధకారంలో మగ్గడం వల్ల అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోని ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది.

ఉద్యోగులు ఆరు నెలల దాకా ఎటువంటి నిరసన చేపట్టకూడదని స్పష్టం చేసింది. అయినా కూడా అక్కడి ఉద్యోగులు సమ్మెను కొనసాగించడం గమనార్హం. బుధవారం కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో అక్కడక్కడా ఇంకా అంధకారమే అలుముకుంది. దాదాపు 36 గంటల పాటు విద్యుత్ అంతరాయం తో పిల్లలు, పెద్దలు నానా అవస్థలు ఎదుర్కొన్నారు.