Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ సూచ‌న‌కు నో చెప్పేసిన బాబు

By:  Tupaki Desk   |   8 Dec 2017 4:42 AM GMT
ప‌వ‌న్ సూచ‌న‌కు నో చెప్పేసిన బాబు
X
నాలుగేళ్ల సంధి ఏపీలో చిత్ర‌మైన సీన్ ఒక‌టి క‌నిపిస్తుంది. మిత్రుడిగా వ్య‌వ‌హ‌రిస్తూనే.. ఎవ‌రినైనా అడిగేస్తా.. అవ‌స‌ర‌మైతే ప్ర‌శ్న‌ల‌తో క‌డిగేస్తానంటూ అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి అరిచేస్తుంటారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయ‌న క‌మిట్ మెంట్ ఎంత‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఆయ‌న మాట‌ల విష‌యంలో వ‌చ్చే తేడాతోనే ఇబ్బంది అంతా. అంద‌రూ త‌న‌కు స‌మానం అంటూనే.. చంద్ర‌బాబు పార్టీ ప‌ట్ల అంతులేని ఔదార్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ప‌ల్లెత్తు మాట అనేందుకు ఇష్ట‌ప‌డ‌రు.

ప‌వ‌న్ లోని ఆ ధోర‌ణి చంద్ర‌బాబుకు విప‌రీతంగా న‌చ్చుతుందంటారు. అంద‌రిని ప్ర‌శ్నిస్తాన‌ని చెప్పే ప‌వ‌న్‌.. త‌న‌ను మాత్రం ప‌ట్టించుకోని వైనం బాబుకు సైతం న‌చ్చుతుందంటారు. అందుకే.. అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఫ‌లానా స‌మ‌స్య‌ల ఉంది.. దీని సంగ‌తి చూడాల‌న్నా.. గ‌డువు ఫిక్స్ చేసి అల్టిమేటం జారీ చేసిన‌ట్లుగా ప‌వ‌న్ చేసినా బాబు ఓకే అనేస్తుంటారు. చుర‌క‌త్తుల్లాంటి విమ‌ర్శ‌లతో పోల్చిన‌ప్పుడు.. ఫ్రెండ్లీగా అల్టిమేటం విధించ‌టంతో వ‌చ్చే ఇబ్బందేమీ ఉండ‌దు క‌దా.

ఎప్ప‌టిలానే ఈసారి ప‌వ‌న్ త‌న పాత ప‌ద్ధ‌తినే అనుస‌రించారు. గ‌తంలో రాజ‌ధాని కోసం భూములు ఇవ్వ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని రైతుల వ‌ద్ద నుంచి బ‌ల‌వంతంగా భూసేక‌ర‌ణ చేయొద్ద‌ని గ‌ట్టిగా ప‌వ‌న్ అన్న వెంట‌నే.. ఆ ప్రక్రియ‌ను అప్ప‌టిక‌ప్పుడు ఆపేశారు చంద్ర‌బాబు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌కు తానెంత ప్రాధాన్య‌త ఇస్తానో చూసి చూపిస్తుంటారు బాబు.

అలాంటి చంద్ర‌బాబు తొలిసారి ప‌వ‌న్ మాట‌కు నో చెప్పేశారు. గురువారం పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన ప‌వ‌న్‌.. ప్రాజెక్టుకు సంబంధించిన లెక్క‌లు చెప్పాల‌ని.. శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌న్న‌ట్లుగా ప‌వ‌న్ మాట్లాడారు. గ‌తంలో పోలిస్తే.. పోల‌వ‌రం విష‌యంలో బాబును ఇబ్బంది పెట్టిన‌ట్లుగా మాట్లాడింది లేదు ప‌వ‌న్‌. అయితే.. అడిగిన మూడు నాలుగు ప్ర‌శ్న‌ల‌కు ఒప్పుకుంటే బాబుకు ఎదుర‌య్యే ఇబ్బందెంతో. అందుకే కాబోలు.. ఎప్పుడూ లేని రీతిలో చంద్రాబు గంట‌ల వ్య‌వ‌ధిలోనే రియాక్ట్ అయ్యారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు మీద శ్వేత‌ప‌త్రం అవ‌స‌రం లేద‌ని.. ప్రాజెక్టు ప‌నులు.. వివ‌రాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్ లైన్ లో పెడుతున్నామ‌ని.. అలాంట‌ప్పుడు శ్వేత‌ప‌త్రంతో ప‌నేమిటంటే ఎదురు ప్ర‌శ్నించారు. లెక్క‌ల విష‌యంలోనే కాదు.. పోల‌వ‌రంపై అఖిల‌ప‌క్షం వేయాల‌న్న ప‌వ‌న్ సూచ‌నను రిజెక్ట్ చేసేశారు. అఖిల‌ప‌క్షం కంటే కూడా కేంద్రం ప‌నులు చేయ‌టం ముఖ్య‌మ‌ని ఆయ‌న బ‌దులిచ్చారు.

ప‌వ‌న్ ఒక యాంగిల్ లో ఆలోచిస్తున్నార‌ని.. ప్రాజెక్టు పూర్తి కావాల‌న్నఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా కామెంట్ చేశారు . అదే స‌మ‌యంలో ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. విప‌క్ష నేత ఆలోచ‌న వేరే ఉందంటూ విమ‌ర్శించారు.

అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేసి.. వీళ్ల‌ను ఢిల్లీకి తీసుకెళ్లి వివాదం చేయాలా? అంటూ ప్ర‌శ్నించిన బాబు మాట‌లు చూస్తే.. ప‌వ‌న్ సూచ‌న‌ను ఈసారి నో అంటే నో అనేయ‌టం క‌నిపిస్తుంది. ఎందుకిలా..? అన్న ప్ర‌శ్న వేసుకుంటే వ‌చ్చే స‌మాధానం ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని చెప్పాలి.

ఏపీ రాజ‌ధాని భూముల విష‌యంలో రైతుల కోర్కె కానీ.. ఉద్దాణం కిడ్నీ స‌మ‌స్య‌పైనా.. గోదావ‌రి జిల్లాలో అక్వాఫుడ్ పార్కు మీద ప‌వ‌న్ రియాక్ట్ కావ‌టం.. ఆయ‌న మాట‌ల‌కు అనుగుణంగా బాబు ఓకే అనేస్తుంటారు. కానీ.. ఈసారి ప‌వ‌న్ సూచ‌న చేసింది పోల‌వ‌రం ప్రాజెక్టు మీద‌. ప‌వ‌న్ కోరిన‌ట్లు చేస్తే.. ప‌వ‌న్ సంగ‌తి త‌ర్వాత‌.. అటు కేంద్రానికి.. ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి చెప్పాల్సిన స‌మాధానాలు చాలా ఉంటాయి. చూస్తూ.. చూస్తూ కంప నెత్తిన వేసుకోవ‌టం కంటే ప‌వ‌న్ సూచ‌న‌కు మొహ‌మాటానికి పోకుండా నో చెప్పేయ‌టం బెట‌ర్‌. ఆ ప‌నే చంద్ర‌బాబు తాజాగా చేశార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.