Begin typing your search above and press return to search.

బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందా..?

By:  Tupaki Desk   |   16 Jun 2017 12:00 PM GMT
బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందా..?
X
మొత్తానికి మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అక్కడ కమలం పార్టీ ప్రభుత్వం సవ్యంగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. మిత్రపక్షంలో శత్రుపక్షంగా వ్యవహరించే శివసేన ధాటికి కమలం తట్టుకోలేకపోతోంది. శివసేన గట్టిగా ఊదితే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉందక్కడ. మరి ఇదంతా చూస్తుంటే మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే మూడు సంవత్సరాలను పూర్తి చేసుకున్న ఫడ్నవీస్ ప్రభుత్వం ఏ క్షణమైన కూలే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరించిందికానీ, సొంత బలం లేదు. అక్కడ హంగ్ తరహా పరిస్థితులు ఏర్పడగా.. శివసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే.. శివసేన తరచూ బీజేపీతో పేచీలు పెడుతోంది. నరేంద్రమోడీని కూడా శివసేనాధినేత పలుసార్లు విమర్శించారు. అసలే ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించి భంగపడ్డాడు ఉద్ధవ్. దీంతో ఫడ్నీవీస్ పై అనేక సార్లు ఫైర్ అవుతుంటాడాయన. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ - శివసేనల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయని దీంతో శివసేన మహా ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మరి అదే జరిగితే మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. మధ్యంతరం రావడం ఖాయం. మరి అదే గనుక జరిగితే విపక్షాలకు మంచి అవకాశం దొరికినట్టే. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ కాంగ్రెస్ పరిస్థితి కొంచెం మెరుగు. ఎన్సీపీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ తో సఖ్యతతోనే ఉంది. ఆ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే ఆ రాష్ట్రంలో రాజకీయం మొత్తం మారిపోయే అవకాశం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/