Begin typing your search above and press return to search.

చాణక్య చెప్పింది సరిగ్గా రివర్స్ అయ్యిందే?

By:  Tupaki Desk   |   8 Nov 2015 12:31 PM IST
చాణక్య చెప్పింది సరిగ్గా రివర్స్ అయ్యిందే?
X
ఎగ్జిట్ పోల్స్ విషయంలో కొన్ని మీడియా సంస్థలకు ఉండే విశ్వసనీయత వేరుగా ఉంటుంది. జాతీయ స్థాయిలో చాణక్య సంస్థ వెల్లడించే ఎగ్జిట్ పోల్స్ సాదారణంగా తుది ఫలితానికి దగ్గరగా ఉంటాయి. అయితే.. మొదటిసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

ఐదు దశల్లో జరిగిన బీహార్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. మొత్తం ఏడు మీడియా సంస్థల్లో (పోలింగ్ పూర్తి అయిన రోజున ప్రకటించిన సంస్థలు) రెండు మినహా మిగిలిన ఐదు మీడియా సంస్థలు లౌకిక కూటమికే విజయం ఖాయమని తేల్చాయి. అయితే.. అందుకు పూర్తి భిన్నమైన జోస్యాన్ని చాణక్య చెప్పింది. ఎన్డీయేకు 155.. లౌకిక కూటమికి 83 స్థానాలు వస్తాయని పేర్కొంది. నిజానికి చాణక్య వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ పలువురిని విస్మయానికి గురి చేశాయి.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఫలితాలు వెలువడతూ.. విజయం లౌకిక కూటమికి అన్న విషయం తేలుతున్న నేపథ్యంలో చాణక్య చెప్పిన ఫలితానికి రివర్స్ గా రావటం గమనార్హం. ఎన్డీయేకు 155 సీట్లు వస్తాయని చెబితే.. సరిగ్గా ఆ అంకెకు మరో సీటు కలిపి మహా కూటమికి వస్తే.. లౌకిక కూటమికి వస్తాయని చెప్పిన 83 స్థానాలు కూడా ఎన్డీయేకు రాకుండా 75సీట్లకే పరిమితం కావటం విశేషం. ఈ పలితాల్ని చూస్తున్న వారు చాణక్య మీడియా సిబ్బంది ఒకపేరు చెప్పబోయి.. మరో పేరు చెప్పి ఉంటారని కామెడీ చేసుకుంటున్నారు. ఏమైనా చాణక్య చెప్పిన సీట్లు సరిగ్గా రివర్స్ లో రావటం విశేషమే.