Begin typing your search above and press return to search.

పెట్రోల్ కోసం రెండు రోజులు బంకు వ‌ద్దే శ్రీలంక క్రికెట‌ర్!

By:  Tupaki Desk   |   16 July 2022 11:42 AM GMT
పెట్రోల్ కోసం రెండు రోజులు బంకు వ‌ద్దే శ్రీలంక క్రికెట‌ర్!
X
గ‌త నాలుగు నెల‌లుగా ద్వీప దేశం శ్రీలంక‌లో నెల‌కొన్న ఆర్థిక సంక్షోభం ఇంకా ముగియ‌లేదు. పైగా అంత‌కంత‌కూ తీవ్ర‌మ‌వుతోంది. ఇప్ప‌టికే లీట‌ర్ పెట్రోలు, డీజిల్ దాదాపు రూ.500కు చేరుకున్నాయి. కిలో ట‌మోటాలు, కిలో ఉల్లి పాయలు రూ.200 ప‌లుకుతున్నాయి. గ్యాస్ సిలిండ‌ర్ రూ.5,500కు చేరుకుంది. దీంతో సాధార‌ణ ప్ర‌జ‌లే కాకుండా సెల‌బ్రిటీలు సైతం తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్నారు. మ‌రోవైపు దేశాధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్ష దేశం వ‌దిలి పారిపోయాడు. ప్ర‌స్తుతం ఆయ‌న భార్య‌తో క‌ల‌సి సింగ‌పూర్ లో త‌ల‌దాచుకున్నారు. ఈ నేప‌థ్యంలో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ర‌ణిల్ విక్ర‌మ్ సింఘే బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగతి తెలిసిందే.

కాగా ఇటీవ‌ల పెట్రోలు కోసం క్యూలైనులో నిల్చుని ఒక డ్రైవ‌ర్ గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. చ‌మురు కొనుగోలు చేయ‌డానికి శ్రీలంక వ‌ద్ద డాల‌ర్లు లేవు. దీంతో ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ప్ర‌క‌టించింది.. ఆ దేశం. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌ను కోరింది. శ్రీలంకలో గత కొంతకాలంగా ఇంధన కొరత నెలకొంది. దాంతో పెట్రోల్ బంక్‌ల దగ్గర పెట్రోల్, డీజిల్ కోసం పొడవైన క్యూలు ఉంటున్నాయి. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాహనదారులు తమ వాహనాలను ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర వదిలేస్తున్నారు.

కాగా ఆ దేశ క్రికెట‌ర్ చమిక కరుణరత్నె కూడా పెట్రోల్ కోసం దాదాపు రెండు రోజులు బంక్ వద్ద క్యూలో ఉండాల్సి వచ్చింద‌ని చెబుతున్నాడు. కొలంబో, ఇతర ప్రాంతాల్లో క్రికెట్ ప్రాక్టీస్ కోసం తాను వెళ్లాల్సి ఉంద‌ని.. దాంతో కారుకి పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కి వెళ్లి.. రెండు రోజుల పాటు అక్కడ క్యూలో ఉండాల్సి వచ్చింద‌ని చ‌మిక క‌రుణ‌ర‌త్నె అంటున్నాడు. తాను రూ.10,000 పెట్టిపెట్రోల్ కొట్టించాన‌ని.. కానీ.. ఇది ఓ 2-3 రోజుల్లోనే అయిపోతుంద‌ని చ‌మిక క‌రుణ‌ర‌త్నె ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆసియాకప్, లంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లల్లో పాల్గొనడానికి అవసరమైన ప్రాక్టీస్ సెషన్స్ కోసం కొలంబోలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, పెట్రోల్ సంక్షోభ పరిస్థితుల్లో ప్రయాణం సాగించడం కష్టతరమౌతోందని చెప్పాడు. ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి భారత్ సహకరించిందని చమిక పేర్కొన్నాడు. ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించిందని, అందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇది ఒక్క చ‌మిక క‌రుణర‌త్న ఆవేద‌నే కాదు.. శ్రీలంక ప్ర‌జ‌లంద‌రి ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.

మ‌రోవైపు శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నా ఆ దేశంలో ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు మాత్రం జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో పాకిస్థాన్ టీమ్ ప‌ర్య‌టిస్తోంది. గాలెలో జూలై 16న‌ తొలి టెస్టు మ్యాచ్ కూడా ప్రారంభమైంది. క్రికెట్ వ‌ల్ల ప‌ర్యాట‌కులు శ్రీలంక‌కు రావ‌చ్చ‌ని.. త‌ద్వారా విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంద‌ని.. దీంతో అక్కడ టూరిజం పెరిగే అవకాశం ఉంద‌ని లంకేయులు భావిస్తున్నారు.

మ‌రోవైపు ఆసియా కప్‌ 2022కు శ్రీలంకనే ఆతిధ్యం ఇవ్వనుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల చూసి ఆ దేశ క్రికెట‌ర్లు ఆందోళ‌న చెందుతున్నారు. పెట్రోల్ దొర‌క‌క‌పోవ‌డం పరోక్షంగా లంక క్రికెటర్లపై కూడా పడుతోంది. ఆ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ దొరకక.. ఎందరో ఆటగాళ్లు ప్రాక్టీస్‌ కు దూర‌మ‌వుతున్నారు. గ్రౌండ్‌ వరకు వెళ్లడానికి ర‌వాణా స‌దుపాయాలు లేక‌ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆసియా కప్‌ వేదికను ఐసీసీ మారుస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.