Begin typing your search above and press return to search.

చాగంటి ప్రవచనాలు ఎలా మొదలయ్యాయి?

By:  Tupaki Desk   |   12 Sept 2016 8:00 PM IST
చాగంటి ప్రవచనాలు ఎలా మొదలయ్యాయి?
X
ఈ రోజుల్లో మంచి మాటలు చెబితే ఎవరు వింటారు.. స్వామీజీల మాటలు యువతకు ఏం ఎక్కుతాయి అనేవాళ్లకు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు గట్టి సమాధానం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆయన అభిమానులే. ఆయన తెరమీద కనిపిస్తే.. ఆయన మాట వినిపిస్తే అలా చూస్తూ.. వింటూ ఉండిపోవాల్సిందే. అలాంటి సమ్మోహన పరిచే ప్రవచనాలు ఆయనవి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో ఒకరిగా మారడానికి ఆయన ప్రవచనాలే కారణం. మరి చాగంటి ప్రవచనాలు చెప్పడం ఎప్పుడు.. ఎందుకు మొదలుపెట్టారు.. ఎలా ఫేమస్ అయ్యారు.. ప్రవచనాలు చెప్పడానికి ఆయన డబ్బులేమైనా పుచ్చుకుంటారా.. ఈ ప్రశ్నలన్నింటికీ ఆయన మాటల్లోనే సమాధానాలు తెలుసుకుందాం పదండి.

‘‘మా నాన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేశారు. ఆయనకు శాస్త్రం తెలుసు. ఆయన నుంచే నాకు జ్నానం అబ్బింది. ఐతే నేను ప్రవచనకారుడిగా మారడానికి స్ఫూర్తి శ్రీభాష్యం అప్పలాచార్యులు అనే స్వామీజీ. ఆయన విశాఖపట్నంలో ఉండేవారు. ఒక రోజు ఆయన కాకినాడలో ప్రవచనాలు చెబుతున్నారని తెలిసి నేను నా భార్య వెళ్లాం. ఆ కార్యక్రమం ముగించుకుని వచ్చాక నేను ఆ ప్రవచనాల గురించే మాట్లాడుతుంటే మా ఆవిడ కల్పించుకుని.. ‘దీనిపై మీకింత అనురక్తి ఉంది కదా. ఇద్దరం ఎలాగూ ఉద్యోగం చేస్తున్నాం. మనం ఏమీ ఆశించకుండా.. శాస్త్రంలో ఏముందో దాన్ని దాటకుండా మంచి మాటలు ప్రజల హితం కోసం ఎందుకు చెప్పకూడదు. స్వామివారి అడుగుజాడల్లో ఎందుకు నడవకూడదు’ అని అడిగింది. అప్పుడే నాకు సంకల్పం కలిగింది. ఆ తర్వాత మాతా శివచైతన్య అనే ఆవిడ పెద్దాపురంలో భాగవతం గురించి మాట్లాడుతూ ఓ ప్రశ్న వేశారు. దానికి నేను చెప్పిన సమాధానం నచ్చి.. నన్ను భాగవతం గురించి మాట్లాడమన్నారు. ఆమె చాలా సంతోషపడి నాకు బట్టలు కూడా పెట్టారు. మరుసటి రోజు ఇదంతా పత్రికల్లో వచ్చింది. అప్పుడే ప్రవచనాలు చెప్పొచ్చన్న విశ్వాసం కలిగి దాన్నే వ్యాపకంగా మార్చుకున్నాను. ఐతే ఇప్పటిదాకా ప్రవచనాల కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నేను.. మా ఆవిడ ప్రభుత్వ ఉద్యోగులం. మా అబ్బాయి అమ్మాయి విదేశాల్లో స్థిరపడ్డారు. నాకు డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు’’ అని చాగంటి అన్నారు.