Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు ప్ర‌ముఖుల్ని వేధిస్తున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   24 Oct 2018 5:18 AM GMT
ఆ ముగ్గురు ప్ర‌ముఖుల్ని వేధిస్తున్నార‌ట‌!
X
వెంట‌ప‌డ‌టం.. వేధింపుల‌కు గురి చేయ‌టం అమ్మాయిల‌కు మామూలే. అందుకు భిన్నంగా పేరు మోసిన ప్ర‌ముఖుల‌కు అలాంటి ఇబ్బందులు ఎదురుకావ‌టం ఏమిటి? అన్న సందేహం క‌లగొచ్చు కానీ నిజ‌మ‌ని చెబుతున్నారు తెలంగాణ విప‌క్ష నేత‌లు కోదండం మాష్టారు.. ఎల్‌.ర‌మ‌ణ‌.. సీపీఐ చాడ వెంక‌ట‌రెడ్డిలు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రిని వారు త‌ప్పు ప‌డుతున్నారు. త‌మ చేతిలో ఉన్న అధికారాన్ని ఉప‌యోగించి త‌మ‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్న‌ట్లుగా వారు ఆరోపిస్తున్నారు.

తాము ప్ర‌యాణించే వాహ‌నాల్ని అక్ర‌మంగా నిలిపివేస్తున్నార‌ని.. అవ‌స‌రం లేకుండా త‌నిఖీలు చేస్తున్నార‌ని.. షాడో పార్టీలు త‌మ‌ను వెంబ‌డిస్తున్న‌ట్లుగా వారు ఆరోపిస్తున్నారు. టీఆర్ ఎస్ స‌ర్కారు తీరును ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లాల‌ని వారు డిసైడ్ అయ్యారు.

త‌మ‌కు ఎదుర‌వుతున్న చేదు అనుభ‌వాలను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన ఈ ముగ్గురు నేత‌లు.. టీఆర్ ఎస్ తీరుపై మండిప‌డ్డారు. త‌న కుటుంబ స‌భ్యులు ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని క‌రీంన‌గ‌ర్ ద‌గ్గ‌ర నిర్బంధంగా నిలిపివేసి..త‌నిఖీ చేస్తున్నట్లుగా ర‌మ‌ణ వెల్ల‌డించారు. ఇక‌.. కోదండం మాష్టారి వాహ‌నాన్ని హైద‌రాబాద్‌ లో త‌నిఖీ చేసిన‌ట్లుగా ఆయ‌న చెబుతున్నారు.

తాను ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని షాడో పార్టీ వెంబ‌డిస్తుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. మొత్తానికి పార్టీ ప్ర‌ముఖులుగా ఉన్న త‌మ‌లాంటి వారికే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే.. మిగిలిన వారి ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటున్నారు. వ్య‌వ‌స్థ‌ల్ని త‌న గుప్పిట్లో ఉంచుకున్న కేసీఆర్‌.. త‌న‌కు తోచిన‌ట్లుగా న‌డిపిస్తున్నార‌ని వారు ఫైర్ అవుతున్నారు. టీఆర్ ఎస్ ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వ పోక‌డ‌ల‌పై ఎన్నిక‌ల సంఘానికి కంప్లైంట్ ఇవ్వాల‌ని వారు నిర్ణ‌యించారు.