Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు గిన్నీస్ బుక్ లో ఎక్కించాలట

By:  Tupaki Desk   |   18 Nov 2015 6:49 AM GMT
కేసీఆర్ కు గిన్నీస్ బుక్ లో ఎక్కించాలట
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ను గిన్నీస్ బుక్ లో ఎక్కించాలని అక్కడి సీపీఐ నేతలు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న సీపీఐ నాయకులు ఇలా కేసీఆర్ గొప్పదనం కోసం కోరడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా... కానీ, నిజమే.. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాత్రం కేసీఆర్ కు గిన్నిస్ రికార్డు ఇవ్వాల్సిందే అంటున్నారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ ను మించినవారు లేనేలేరని... ఆయనకు గిన్నిస్ రికార్డు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారని అంటున్నారు.

అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనుడని, ఈ విషయంలో ఆయనను మించినవారు లేరు కాబట్టి తప్పకుండా గిన్నిస్ బుక్‌ లోకి ఎక్కించాలని చాడ వెంకటరెడ్డి అంటున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా మాయమాటలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్న సీఎం కేసీఆర్ అహంభావం తగ్గాలంటే వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్‌ ను ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఐ వరంగల్ జిల్లా మహాసభల్లో మాట్లాడిన ఆయన కేసీఆర్ ను, ఆయన ప్రభుత్వాన్ని ఏకిపడేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో 99 శాతం అమలు కాలేదని, వంద శాతం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. సర్వేల పేరిట ఇరిగేషన్‌ కు కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేస్తామని కేసీఆర్ చెప్తున్నారని... అలా అయితే... అర్హులందరికీ సొంతింటి కల నెరవేరాలంటే కనీసం 50 ఏళ్లు పడుతుందన్నారు. కేసీఆర్ ప్రతి విషయంలోనూ అబద్ధాలే చెబుతున్నారని... ఆయనకు ఆ విషయంలో ప్రపంచ రికార్డు ఇవ్వాల్సిందేనని చాడ ముచ్చటపడుతున్నారు.