Begin typing your search above and press return to search.

‘అమ్మ’ ఓకే అని విద్యాసాగర్ కన్ఫర్మ్ చేశారు

By:  Tupaki Desk   |   2 Oct 2016 5:04 AM GMT
‘అమ్మ’ ఓకే అని విద్యాసాగర్ కన్ఫర్మ్ చేశారు
X
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారానికి.. వాస్తవానికి మధ్య పొంతన లేదన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి.. అమ్మగా అందరూ పిలుచుకునే జయలలిత ఆరోగ్యం ఓకేనన్న మాట తమిళనాడు తాత్కాలిక గవర్నర్ గా వ్యవహరిస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావు నోటి నుంచి రావటంతో పెద్ద రిలీఫ్ గా మారింది. తీవ్ర జ్వరం.. డీహైడ్రేషన్ లాంటి కారణాలతో దాదాపు పది రోజుల కిందట అర్ధ రాత్రి వేళ.. హుటాహుటిన చెన్నై అపోలో లో చేర్పించటం తెలిసిందే. అయితే.. జయలలిత ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో సందేహాలతో కూడిన పోస్టింగ్ లు పెరగటం.. ఇవేమీ నిజం కాదని చెబుతున్నా.. సందేహాలతో తమిళనాడు ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన పరిస్థితి.

ఇదిలా ఉండగా.. తమిళనాడు విపక్ష నేత కరుణానిధి ముఖ్యమంత్రి అనారోగ్యంపై స్పందిస్తూ.. ఆమెకు ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ ఇవ్వటం ఏమిటని ప్రశ్నించటంతో పాటు.. ఎయిమ్స్ వైద్యుల నేపథ్యంలో ఎందుకు చికిత్స నిర్వహించరన్నారు. అంతేకాదు.. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వాస్తవ పరిస్థితులు ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ శుక్ర.. శనివారాల్లో విడుదల చేసిన ప్రకటన ఈ ఇష్యూపై పలువురిలో మరిన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఇదే సమయంలో తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చెన్నై అపోలోను సందర్శించటమే కాదు.. ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించి.. అనంతరం అపోలో ఆసుపత్రుల ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డిని కలిశారు. జయలలిత ఆరోగ్యం గురించి వివరాలు సేకరించారు. ఆమె త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన విద్యాసాగర్ రావు.. జయకు మెరుగైన సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇక.. జయలలితకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అపోలో బ్రిటన్ నుంచి అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఇష్యూలో స్పెషలిస్ట్ అయిన డాక్టర్ రిచర్డ్ జాన్ బేల్ ను ప్రత్యేకరంగా రప్పించి మరీ వైద్యసేవలు అందిస్తున్నారు. జయలలిత ఆరోగ్యంపై విపక్ష నేత కరుణానిధి చేస్తున్న ఆరోపణల్ని అధికార అన్నాడీఎంకే తీవ్రంగా ఖండించటమే కాదు.. త్వరలోనే ముఖ్యమంత్రి జయలలిత కోలుకొని క్షేమంగా తిరిగి వస్తారని చెబుతున్నారు.

విపక్ష నేత డిమాండ్ చేసినట్లుగా జయలలితకు సంబంధించిన ఫోటోల్ని విడుదల చేయాల్సిన అవసరం లేదన్న అన్నాడీఎంకే అధికార ప్రతినిధి రామచంద్రన్.. ఆమె త్వరలోనే ఆసుపత్రి నుంచి బయటకు వస్తారన్నారు. బ్రిటన్ వైద్యుడురిచర్డ్ చికిత్సపై తాము సంతృప్తిగా ఉన్నామని చెప్పిన రామచంద్రన్.. తాము ప్రజలకు మాత్రమే జవాబుదారీ తప్పించి.. విపక్షానికి మాత్రం కాదని వ్యాఖ్యానించారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని.. అమ్మ ఆరోగ్యం ఓకే అనేలా ఉందన్నఅభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/