Begin typing your search above and press return to search.

కేంద్రం దెబ్బ‌..ఏపీకి రూ.1242 కోట్ల బొక్క‌

By:  Tupaki Desk   |   9 March 2017 3:41 PM GMT
కేంద్రం దెబ్బ‌..ఏపీకి రూ.1242 కోట్ల బొక్క‌
X
ఇది ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు గ‌ట్టి స‌వాల్ వంటి ప‌రిణామమే. కేంద్రంలో ఇప్ప‌టికీ త‌న చ‌క్రం తిరుగుతోంద‌ని చెప్తున్న బాబు& టీం ఇప్పుడు గ‌న‌క సీరియ‌స్‌గా రంగంలోకి దిగ‌క‌పోతే ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రం అప్పనంగా రూ.1242 కోట్లు చెల్లించాల్సి వ‌స్తుంది. ఇప్ప‌టికే ఆర్థికంగా బిక్క‌చ‌చ్చిపోయిన ఏపీకి ఇది పెనుభార‌మే. అందుకే అంద‌రి చూపు బాబుపై ఉంది. ఇంత‌కీ విష‌యం ఏంటి అంటారా... ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయి అధికారికంగా మూడేళ్లు కావ‌స్తున్న‌ప్ప‌టికీ...ఆ నిర్ణ‌యం ఫ‌లితంగా ఏపీ రూ.1242 కోట్లు క‌ట్టాల్సి వ‌స్తోంది.

త‌మ రాష్ట్రం త‌మ‌కు కావాల‌నే నినాదంతో తెలంగాణ‌లో ఉద్య‌మం ప్రారంభ‌మై 2012 త‌ర్వాత అది తారస్థాయికి చేరుకున‌న సంగ‌తి తెలిసిందే. 2014లో తెలంగాణ అధికారికంగా ఏర్ప‌డే వ‌ర‌కు నెల‌కొన్న తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు కేంద్రం రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. ఏకంగా పారామిల‌ట‌రీ బ‌ల‌గాల‌ను పెట్టింది ఉస్మానియా యూనివ‌ర్సిటీ వంటి చోట్ల ప్రత్యేక బందోబ‌స్తు ఏర్పాటు చేసింది. అదే స‌మ‌యంలో ఏపీలో కూడా స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్ పోరాటం సాగిన‌ప్ప‌టికీ తెలంగాణ అంత బ‌లంగా లేదు. ఈ విష‌యం ప‌క్క‌న‌పెడితే ఉమ్మ‌డి ఏపీలో శాంతిభ‌ధ్ర‌త‌ల‌ను అదుపులో ఉంచ‌డానికి గాను పారామిల‌ట‌రీ బ‌ల‌గాలు దింప‌డం వ‌ల్ల అయిన ఖ‌ర్చు చెల్లించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్రదేశ్‌ను కోరింది. ష‌రామామూలుగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఈ అప్పును మాఫీ చేయాల‌ని కోరుతూ లేఖ రాసి ఆ విష‌యం ప‌క్క‌న‌పెట్టేశారు.

అయితే ఇటీవలే కేంద్ర హోం శాఖ నుంచి బ‌కాయిలు చెల్లించాల్సిందేనంటూ లేఖ వ‌చ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పారామిల‌ట‌రీ బ‌ల‌గాల‌ను కేటాయించింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరుతో కాబ‌ట్టి మీ రాష్ట్రమే చెల్లించాల‌ని స్ప‌ష్టం చేయ‌డ‌మే కాకుండా...అస‌లు మొత్తంతో పాటు ఇన్నాళ్లు జాప్యం చేసిన సొమ్ము క‌లిపి రూ. 1242 కోట్ల క‌ట్టి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. అయితే మ‌ళ్లీ ఏపీ స‌ర్కారు దీన్ని మాఫీ చేయాల‌ని కోరిన‌ప్ప‌టికీ కేంద్రం నుంచి స్పంద‌న రాలేద‌ని స‌మాచారం.

కాగా, ఏపీ కొంద‌రు ఏపీ అధికారులు ఈ ప‌రిణామంపై పెద‌వి విరుస్తున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో జ‌రిగిన ఉద్య‌మం ఎక్కువ‌గా తెలంగాణ‌లోనే జ‌రిగింద‌ని, బ‌ల‌గాల‌ను సైతం అక్క‌డే ఉప‌యోగించార‌ని గుర్తు చేస్తున్నారు. కేవ‌లం ఏపీ అనే పేరున్నందుకు ఇలా వ‌సూలు చేయ‌డం స‌రికాద‌ని చెప్తున్నారు. అయితే లేఖ రాసినా కేంద్ర నుంచి సానుకూల స్పంద‌న లేక‌పోవ‌డంతో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ల‌ను సీఎం చంద్ర‌బాబు త‌మ పార్టీకి చెందిన కేంద్ర మంత్రుల నెత్తిన పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఏపీ పెను భారం మోపే ఈ విష‌యంలో బాబు ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫ‌లిస్తాయో వేచి చూడాల్సిందే.