Begin typing your search above and press return to search.

తంబీలకు కేంద్రం పొంగల్ గిఫ్ట్ ఇచ్చేసింది

By:  Tupaki Desk   |   8 Jan 2016 8:30 AM GMT
తంబీలకు కేంద్రం పొంగల్ గిఫ్ట్ ఇచ్చేసింది
X
తమిళులకు ఇప్పటివరకు పరుట్చితలైవి (విప్లవ నాయకి) కమ్ ‘‘అమ్మ’’ జయలలిత మాత్రమే వరాలు ఇచ్చేవారు. అయితే.. అమ్మ ఇవ్వలేని ఒక భారీ వరాన్ని కేంద్రం ఇచ్చేసింది. సంప్రదాయ క్రీడగా తమిళులు భావించే జల్లికట్టును అధికారికంగా జరుపుకునేందుకు వీలుగా కేంద్రం అనుమతి ఇచ్చింది. తమిళులు అత్యంత వేడుకగా జరుపుకునే పొంగల్ పండక్కి కాస్త ముందుగా తమిళులకు జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ.. వారు మర్చిపోలేని తోఫాను కేంద్రం ఇచ్చింది.

మరికొద్ది నెలల్లో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మోడీ సర్కారు జల్లికట్టు విషయంలో గతంలోని ఆంక్షలకు భిన్నంగా అనుమతి ఇవ్వటం గమనార్హం. దీంతో.. గత కొద్దికాలంగా తమిళనాడు సర్కారు జల్లికట్టు మీద చేస్తున్న డిమాండ్ ను కేంద్రం తీర్చినట్లైంది. జల్లికట్టు మీద ఉన్న నిషేధాన్ని తొలిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంపై తమిళనాడు రాజకీయ పార్టీలన్నీ కేంద్రానికి థ్యాంక్స్ చెబుతున్నాయి. మరి.. జల్లికట్టు మీద కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానాల ఎదుట ఎవరైనా సవాలు చేస్తారా?.. ఒకవేళ అదే జరిగితే.. అత్యున్నత న్యాయస్థానం ఎలా రియాక్ట్ కానుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు.
ఇంతకీ జల్లికట్టు అంటే ఏమిటంటే..

గిత్తల కొమ్ములు పట్టుకోవటం.. వాటిని వంచేస్తూ తమ జబ్బ బలం చూపించటంతో పాటు.. కోడె గిత్తలపై తమ అధిపత్యాన్ని ప్రదర్శించటం ఈ ఆట లక్ష్యం. ఈ ఆట కారణంగా మూగజీవాల్ని హింసించటం.. వాటిని తీవ్రంగా గాయపర్చటం లాంటివి జరుగుతుంటాయి. అయితే.. అనాదిగా సంప్రదాయ క్రీడగా వస్తున్న ఈ క్రీడపై నిషేధం ఉంది. సంక్రాంతి పండగ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంతో పాటు.. ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే చిత్తూరు జిల్లాలోనూ ఈ జల్లికట్టును క్రీడను ఆడుతుంటారు.