Begin typing your search above and press return to search.

మోడీ పాల‌న ఎలా ఉందో చెప్పిన రిపోర్ట్‌..!

By:  Tupaki Desk   |   7 Oct 2018 10:40 AM IST
మోడీ పాల‌న ఎలా ఉందో చెప్పిన రిపోర్ట్‌..!
X
తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత భార‌తదేశాన్ని ఎక్క‌డికో తీసుకెళ్లిన‌ట్లుగా ప్ర‌ధాని మోడీ గొప్ప‌లు చెప్ప‌టం క‌నిపిస్తుంది. రూ.60 ప్ల‌స్ ఉన్న టీట‌రు పెట్రోల్ ధ‌ర ఏకంగా రూ.90 ద‌గ్గ‌ర‌కు చేరుకోవ‌టం.. రూపాయి విలువ భారీగా త‌రిగిపోవ‌టం.. లాంటి ఇండికేష‌న్లు దేశ ప‌రిస్థితి ఎలా త‌యారైందో చెప్పేస్తున్న ప‌రిస్థితి.

ఇలాంటివేళ‌.. దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య ఎలా ఉంది? యువ‌త‌కు ఉద్యోగాలు ఎలా వ‌స్తున్నాయి? దేశంలో జీతాలు ఎలా ఉన్నాయ‌న్న అంశంపై తాజాగా విడుద‌లైన రిపోర్ట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. దేశంలో అంత‌కంత‌కూ పెరుగుతున్న నిరోద్యోగుల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌న్న విష‌యాన్ని తాజాగా విడుద‌లైన ఒక రిపోర్ట్ స్ప‌ష్టం చేస్తోంది.

గ‌డిచిన 20 ఏళ్ల‌లో దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంద‌ని.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో మోడీ పాల‌న‌లోనూ ఎలాంటి మార్పు లేద‌ని స‌ద‌రు రిపోర్ట్ స్ప‌ష్టం చేస్తోంది. ఢిల్లీలోని అజీమ్ ప్రేమ్ జీ యూనివ‌ర్సిటీకి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ స‌స్టెయిన‌బుల్ ఎంప్లాయ్ మెంట్ విడుద‌ల చేసిన స్టేట్ ఆఫ్ వ‌ర్కింగ్ ఇండియా 2018 నివేదిక‌లో షాకింగ్ అంశాల్ని పేర్కొన్నారు.

ఈ నివేదిక‌లో పేర్కొన్న ముఖ్యాంశాల్ని చూస్తే...

+ దేశంలో నిరుద్యోగుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది.

+ జ‌నాభాలో ప్ర‌స్తుతం నిరుద్యోగ స్థాయి 5 శాతానికి పెరిగింది. ఆందోళ‌న‌క‌రంగా దేశంలో చ‌దువుకున్న యువ‌తలో దాదాపు 16 శాతం మంది నిరుద్యోగ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

+ గ‌డిచిన 20 ఏళ్ల‌లో నిరుద్యోగిత ఇంత భారీగా పెరిగిన సంద‌ర్భం ఇదే.

+ నిరుద్యోగ స‌మ‌స్య‌తో పాటు చేతి నిండా ప‌ని లేక‌పోవ‌టం ఒక పెద్ద స‌మ‌స్య‌. దీంతో.. త‌క్కువ వేత‌నాల‌తోనే సంతృప్తి చెందాల్సిన ప‌రిస్థితి.

+ ద‌క్షిణాదితో పోలిస్తే ఉత్త‌రాదిలో ఎక్కువ‌గా నిరుద్యోగం ఉంది. అయితే.. మిగిలిన రాష్ట్రాల‌తో పోలిస్తే.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. గుజ‌రాత్‌.. క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో నిరుద్యోగం మిగిలిన రాష్ట్రాల స్థాయిలో పెర‌గ‌లేదు.

+ సాధార‌ణ జీవ‌న ప్ర‌మాణానికి ఏ మాత్రం స‌రితూగ‌లేని ప‌రిస్థితి దేశంలో ఉంది. అతి త‌క్కువ వేత‌నాల్ని దేశంలో 92 శాతం మ‌హిళ‌లు.. 82 శాతం పురుషులు పొందుతున్నారు. వీరంతా నెల‌కు రూ.10 వేల కంటే త‌క్కువ జీతానికే బ‌తికేస్తున్నారు.

+ దేశ వ్యాప్తంగా 67 శాతం కుటుంబాల నెల‌స‌రి ఆదాయం రూ.10వేలే. ఈ విష‌యాన్ని 2015లో లెక్క క‌ట్టారు. జాతీయ పే క‌మిష‌న్ నిర్ణ‌యించిన క‌నీస వేత‌నమైన రూ.18వేల కంటే ఇది త‌క్కువ కావ‌టం గ‌మ‌నార్హం.