Begin typing your search above and press return to search.

వేల కోట్లు ఖర్చుతోనూ మోడీకి రాని మంచిపేరు?

By:  Tupaki Desk   |   5 Sept 2015 11:12 PM IST
వేల కోట్లు ఖర్చుతోనూ మోడీకి రాని మంచిపేరు?
X
కొన్ని నిర్ణయాలు చాలా వేగంగా తీసుకోవాలి. అందులో ఏ మాత్రం తేడా వచ్చినా జరిగే నష్టం పూడ్చుకోలేనంత. పదిహేను నెలలుగా మోడీ ప్రధానిగా ఉన్నా.. ఇప్పటివరకూ ఆయన్ను తీవ్రంగా ప్రభావం చూపించిన అంశాల్లో ఒకే ర్యాంకు వారికి ఒకటే ఫించన్ ఉద్యమమే. లేకపోతే.. మోడీ లాంటి నేత తలొగ్గి ఒప్పుకోవటం అంత చిన్న విషయం కాదు కదా.

ఖజానా మీద దాదాపు రూ.10వేల కోట్ల మేర భారం పడే నిర్ణయం మీద మోడీ సర్కారు సానుకూల నిర్ణయం తీసుకోవటం అంటేనే.. సర్కారు మీద ఎంత ఒత్తిడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నిజానికి ఈ ఆందోళన నాలుగు దశాబ్దాలుగా సాగుతున్నదే. ఈ మధ్య కాలంలో మరే ప్రభుత్వం మీదా రానంత ఒత్తిడి మోడీ సర్కారు మీద వచ్చింది.

అయితే.. ఆందోళనను అంచనా వేయటంలో దొర్లిన పొరపాటుతో.. దేశ వ్యాప్తంగా ఈ అంశంపై మోడీ సర్కారు కొంత వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వచ్చింది. జరిగిన డ్యామేజీని అర్థం చేసుకున్న సర్కారు.. దాని నుంచి బయటపడేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవటానికి సిద్ధమైంది. ఏ ఆందోళన కారణంగా తమ పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లిందో.. ఆదే నిర్ణయానికి సానుకూల స్పందన ద్వారా.. శుభం కార్డు వేయాలన్న వ్యూహంతో ఒకే ర్యాంకు.. ఒకే పింఛన్ నినాదానికి కేంద్రం సైతం ఓకే చెప్పేసింది. అంతేకాదు.. 2014 జూలై ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేస్తామని.. అప్పటి నుంచి ఇప్పటివరకూ మధ్య ఉన్న కాలానికి సంబంధించి బకాయిలు చెల్లిస్తామంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీపి కబురు వెల్లడించారు.

కాకపోతే.. ఈ నిర్ణయాన్ని ప్రకటించేందుకు తీసుకునే సమయం ఎక్కువగా ఉండటంతో పాటు.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు జరిపిన దుశ్చర్య మోడీ సర్కారును చాలా బ్యాడ్ చేసిందని చెప్పక తప్పదు. నిజానికి ఆ ఘటన కూడా మోడీ సర్కారును తలొగ్గేలా చేసిందని చెప్పక తప్పదు. తాజా నిర్ణయంతో రిటైర్ అయ్యే నాటికి ఏ ర్యాంకులో రిటైర్ అవుతారో.. ఆ ర్యాంకు వారు ఎప్పుడు రిటైర్ అయినా ఒకే తరహా పింఛన్ అందనుంది.

ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించేందుకు కేంద్ర రక్షణ మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఈ నిర్ణయాన్ని తీసుకోవటానికి జరిగిన ఆలస్యానికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఇదేదో.. ముందే చెప్పేసి.. ఒక గడువు ప్రభుత్వం పెట్టి ఆందోళనను ముగించేసి.. ఆనందోత్సాహాల మధ్య నిర్ణయం ప్రకటించి ఉంటే.. మోడీ సర్కారు ఎంతో ప్రయోజనం కలిగేది. అదే జరిగి ఉంటే.. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం చారిత్రకంగా మారటంతో పాటు.. ఒక సమస్య తెర మీదకు వచ్చినప్పుడు.. దాన్ని పరిష్కరించేందుకు సమకాలీన రాజకీయాలకు భిన్నంగా మోడీ సర్కారు వ్యవహరించిందన్న పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకునే వారు.

కానీ.. న్యాయమైన అంశాల విషయంలోనూ సముచితమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఏదో ఒక ఆందోళన.. మరేదో భారీ సంఘటన జరిగి.. ప్రభుత్వానికి మాయని మచ్చలా మారితే తప్పని స్పందించని పాత సర్కారు తరహాలోనే మోడీ సర్కారు వ్యవహరించి తప్పు చేసింది. ఈ కారణంతోనే ఖజాపై దాదాపు రూ.8వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లు.. బకాయిల చెల్లింపు విషయంలో మరో రూ.10వేల కోట్ల వరకూ భారం పడే నిర్ణయం తీసుకోక తప్పనిసరి పరిస్థితి చోటు చేసుకుంది. అయితే.. ఇంత ఖరీదైన నిర్ణయం తీసుకొని కూడా మైలేజీ మూటగట్టుకునే అద్భుతమైన ఛాన్స్ ను మిస్ చేసుకోవటం మోడీ సర్కారుకు ఇబ్బంది కలిగించేదే.