Begin typing your search above and press return to search.

ముంద‌స్తుకు సెంట్ర‌ల్‌.. టీఆర్ఎస్ కు టెన్ష‌న్‌..!

By:  Tupaki Desk   |   24 Jan 2022 9:33 AM GMT
ముంద‌స్తుకు సెంట్ర‌ల్‌.. టీఆర్ఎస్ కు టెన్ష‌న్‌..!
X
ముందస్తు ఎన్నిక‌ల‌కు కేంద్రం రానుందా..? ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో గెలిస్తే అదే అద‌నుగా పార్ల‌మెంటును ర‌ద్దు చేయ‌నుందా..? ప్ర‌తిప‌క్షాలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న‌వేళ వాటికి పుంజుకునే అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిందా..?

గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి పాటించిన సూత్రాల‌నే కేంద్ర‌మూ అమ‌లు చేయ‌నుందా..? దీని వ‌ల్ల టీఆర్ఎస్ కు న‌ష్టం క‌ల‌గ‌నుందా? అంటే.. అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటుతో 2014లో తొలిసారి అధికారంలోకి వ‌చ్చింది తెలంగాణ రాష్ట్ర స‌మితి. అప్పుడు బొటాబొటీ మెజారిటీతో నెగ్గినా.. త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచింది. తొలి ఐదేళ్ల‌లో ప‌లు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టింది.

పీఆర్సీ పెంపు.. పింఛ‌న్ల పెంపు.. కాళేశ్వ‌రం.. రైతు బంధు.. ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌.. లాంటి వాటితో సామాన్య ప్ర‌జానీకంలో.. రైతుల్లో.. నిరుద్యోగుల్లో.., ఉద్యోగుల్లో పాజిటివ్ దృక్ప‌థాన్ని ఏర్ప‌ర్చుకుంది. వీటితో 2019లో అధికారాన్ని సులువుగా చేజిక్కించుకునేదే.

కానీ కొన్ని స్వ‌యం త‌ప్పిదాలు.. ఎన్నిక‌ల మేనిఫెస్టో అంశాలు పూర్తిగా అమ‌లు కాక‌పోవ‌డం.. చివ‌ర్లో ప్ర‌జ‌ల్లో కొంత అసంతృప్తి నెల‌కొంది. దీన్ని గుర్తించిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టారు.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీకి వెళితే రాజ‌కీయంగా జ‌రిగే న‌ష్టం గురించి అంచనా వేశారు. ఆరు నెల‌ల ముందే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. దీంతో అటు బీజేపీని.. ఇక్క‌డ కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు పెట్టుకునేలా చేసి కాంగ్రెస్ ను దెబ్బ‌కొట్టి బంప‌ర్ మెజారిటీతో గెలిచారు కేసీఆర్‌.

ఇప్పుడు టీఆర్ఎస్ పాటించిన సూత్రాల‌నే బీజేపీ అమ‌లు చేయాల‌ని భావిస్తోంది. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే ముంద‌స్తుకే వెళ్లాల‌ని యోచిస్తోంది.

షెడ్యూల్ ప్ర‌కారం 2024 మేలో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గాలి. ఐదు రాష్ట్రాల్లో మెజారిటీ ఫ‌లితాలు సాధిస్తే ఇదే ఊపుతో వెంట‌నే కాక‌పోయినా 2023 చివ‌ర్లో అయినా ముంద‌స్తుకు వెళ్లాల‌ని ఆలోచిస్తోంది. దీంతో 2024లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న రాష్ట్రాలు ఏపీతో స‌హా ఆరు నెల‌లు ముందుకు వ‌చ్చే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం. ఎలాగూ చాలా రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉన్నందున వారి జ‌మిలి ఎన్నిక‌ల క‌ల కూడా సాకారం అవుతుంది.

అయితే.. కేంద్రం ముంద‌స్తు వ‌ల్ల మొద‌టి దెబ్బ టీఆర్ఎస్ కే ప‌డే ప్ర‌మాదం ఉంది. ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికే టీఆర్ఎస్ పై చాలా వ్య‌తిరేక‌త ఉంది. ఒక వైపు బండి సంజ‌య్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర బీజేపీ దూకుడుగా వెళుతోంది.

ముంద‌స్తు ఎన్నిక‌ల వ‌ల్ల అటు పార్ల‌మెంటులో.. ఇటు అసెంబ్లీలో ఏక‌కాలంలో టీఆర్ఎస్ ని నిలువ‌రించే అవ‌కాశం చిక్కుతుంది. నీవు నేర్పిన విద్య‌యే నీర‌జాక్ష‌.. త‌ర‌హాలో టీఆర్ఎస్ పాల‌సీని అమలు చేసి ఆ పార్టీనే దెబ్బ‌తీయాల‌ని చూస్తోంది బీజేపీ. చూడాలి మ‌రి బీజేపీ ఆశ‌లు ఏమేర‌కు నెర‌వేరుతాయో..!