Begin typing your search above and press return to search.

చడీచప్పుడు లేకుండా పన్ను కోతలు

By:  Tupaki Desk   |   15 July 2020 6:00 AM IST
చడీచప్పుడు లేకుండా పన్ను కోతలు
X
మన దేశంలో పన్నుల భారంతో ఎక్కువగా సతమతం అయ్యేది మధ్య, ఎగువ మధ్యతరగతి జనాలే. కానీ ప్రభుత్వం నుంచి అతి తక్కువగా సాయం పొందేది వాళ్లే. ఉచిత పథకాల్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతూ.. పన్నుల భారాన్ని ఇంకా పెంచుతూ ఆ వర్గాన్ని పీల్చి పిప్పి చేసేస్తుంటాయి ప్రభుత్వాలు. ఓవైపు వేల కోట్లు ఎగ్గొట్టిన బడా బాబుల్ని ఏమీ చేయలేరు కానీ.. మధ్య, ఎగువ మధ్య తరగతి నుంచి మాత్రం పన్నులు ముక్కు పిండి వసూలు చేస్తారు. వారి రుణాల వసూలు విషయంలో అసలేమాత్రం రాజీ పడరు. ఈ వర్గం నుంచి పన్నుల రూపంలో ఎంత వీలైతే అంత లాగడానికి ప్రభుత్వాలు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి.

కేంద్ర ప్రభుత్వం తాజాగా.. ఈ వర్గం నుంచి చడీచప్పుడు లేకుండా పన్నుల రూపంలో డబ్బులు లాగడానికి కొత్త వ్యూహం సిద్ధం చేసింది. ఇకపై బ్యాంకుల నుంచి లేదా పోస్టాఫీసుల నుంచి ఏడాది వ్యవధిలో రూ.20 లక్షలకు పైగా డ్రా చేస్తే 2 శాతం పన్ను రూపంలో చెల్లించుకోవాల్సిందే. అదే కోటి రూపాయలకు పైగా డ్రా చేస్తే పన్ను శాతం 5 శాతం ఉంటుంది. గత ఏడాది సెప్టెంబరు 9నే ఈ పన్ను విధానాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. ఐతే అప్పుడు కోటి రూపాయలకు పైగా ఏడాది వ్యవధిలో డ్రా చేస్తే 2 శాతం పన్ను అన్నారు. కానీ ఇప్పుడు దాన్ని రివైజ్ చేశారు. పై విధంగా పన్నులు మార్చారు. జులై 1నే చడీచప్పుడు లేకుండా ఈ పన్ను విధానాన్ని అమల్లో పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం.