Begin typing your search above and press return to search.

ఆ మూడు దళాలు ఇక నుండి సరిహద్దులకే పరిమితం..కేంద్రం మరో సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   25 Sep 2020 4:00 PM GMT
ఆ మూడు దళాలు ఇక నుండి  సరిహద్దులకే పరిమితం..కేంద్రం మరో సంచలన  నిర్ణయం
X
బీఎస్ ‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్ ‌ఎస్ ‌బీ దళాలను పూర్తిగా సరిహద్దు రక్షణకే పరిమితం చేయాలని కేంద్ర ఆలోచిస్తుంది. అంతర్గత విధుల నుంచి ఈ దళాలను తప్పించి, సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేలా వ్యూహం సిద్ధం చేస్తుంది. తొలిసారిగా గతేడాది కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జరిగిన భేటీలో ఈ అంశంపై చర్చించారు. తాజాగా దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సహా అంతర్గత భద్రతా విధులకు సీఆర్పీఎఫ్‌ దళాలను వినియోగిస్తున్నారు. త్వరలో జరగబోయే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో జరిగే ఉప ఎన్నికల్లో ఈ కొత్త ప్రయోగాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది.

ఇందులో భాగంగా సీఆర్పీఎఫ్‌, రాష్ట్ర పోలీస్ బలగాలను 70:30 నిష్పత్తిలో మోహరించనున్నారు. ఉప ఎన్నికల్లో భద్రత విధులను సీఆర్పీఎఫ్ ‌కు అప్పగించి, బీఎస్ ‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్ ‌ఎస్ ‌బీ వంటి దళాలను క్రమంగా అంతర్గత భద్రత నుంచి ఉపసంహరిస్తామని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో సరిహద్దు భద్రత దళాలను ఎన్నికల నిర్వహణ, వివిధ రాష్ట్రాల్లో ఎదురయ్యే అంతర్గత శాంతి భద్రతల పరిరక్షణ వంటి విధులకు వినియోగిస్తున్నారు. ఇది సరిహద్దు భద్రతకు ముప్పుగా పరిణమించిడంతో దీన్ని పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది.సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలిచ్చారని, మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారని అధికారులు వివరించారు.

సరిహద్దులను సమర్థంగా రక్షించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి రక్షణ శాఖకు చెందిన డీఆర్ ‌డీవో, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ వంటి సంస్థలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని ఒక కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు, స్మగ్లింగ్‌ కు అనుకూలంగా ఉన్న పొడవైన గడ్డిని నిర్మూలించడానికి వ్యవసాయ నిపుణుల సాయం తీసుకోవాలని సూచించింది. పాకిస్థాన్‌ (3,300 కిలోమీటర్లు), బంగ్లాదేశ్‌ (4,096 కిలోమీటర్లు)తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ ఎఫ్... చైనాతో 3,488 కిలోమీటర్ల పొడవునా ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద ఐటీబీపీ, నేపాల్ ‌తో ఉన్న 1,751 కిలోమీటర్లు, భూటాన్ ‌తో ఉన్న 699 కిలోమీటర్ల సరిహద్దు వద్ద ఎస్ ‌ఎస్ ‌బీ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి.