Begin typing your search above and press return to search.

సీఎం రమేష్ కి కేంద్ర మంత్రి పదవి...?

By:  Tupaki Desk   |   10 Jun 2023 12:58 PM GMT
సీఎం రమేష్ కి కేంద్ర మంత్రి పదవి...?
X
బీజేపీకి ఏపీలో ఉన్న ఏకైక ఎంపీ సీఎం రమేష్. అయన రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయి వెళ్ళారు. అయితే రెండవసారి పదవీకాలం నాలుగేళ్ళు ఉండగానే బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అప్పట్లో ఆయనతో పాటు బీజేపీలో చేరిన ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ల పదవీ కాలం ముగిసింది. దీంతో ఏపీలో సీఎం రమేష్ బీజేపీ తరఫున అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

విశాఖలో అమిత్ షా సభ ఏర్పాట్లను కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. అంగబలం అర్ధబలం దండీగా ఉన్న సీఎం రమేష్ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కావడం మరో ప్లస్ పాయింట్. బీజేపీ ఏపీలో ఎదగాలని చూస్తోంది. బలమైన సామాజికవర్గానికి చెందిన రమేష్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

దానికి బలం చేకూర్చే విధంగా విశాఖలో రమేష్ మీడియాతో మాట్లాడిన మాటలనే చూడాలి. ఏపీకి కేంద్రం ఎంతో చేస్తోందని, ఎన్నో నిధులను ఇస్తోందని రమేష్ కేంద్ర మంత్రి తరహాలోనే లెక్కలు అన్నీ వల్లె వేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ నిధులు కూడా ఏపీకి ఎపుడు రాబోతున్నాయో ఆయన డేట్ టైం కూడా చెప్పడం విశేషం.

అంటే అంత పక్కాగా ఆయన కేంద్రం తరఫున అధికారికంగానే మాట్లాడుతున్నారు అనుకోవాలి. ఇక జాతీయ బీజేపీ నుంచి కూడా ఆయన గట్టిగా చెప్పాల్సింది చెబుతున్నారు. ఏపీలో పొత్తుల గురించి తాను మాట్లాడబోను అంటూనే ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని అచ్చం జనసేన పవన్ కళ్యాణ్ భాషలోనే మాట్లాడుతున్నారు.

అదే సమయంలో ఏపీలో బీజేపీ భాగస్వామ్యంతో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన అంటున్నారు అదే విధంగా టీడీపీని పల్లెత్తు మాట అనకుండా రమేష్ జాగ్రత్త పడుతున్నారు. వైసీపీ మీదనే తన బాణాలను ఎక్కు పెడితూ ఆయన మాట్లాడడం విశేషం. ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన రమేష్ ఈ రోజుకీ టీడీపీని ఎక్కడా ఒక్క విమర్శ చేయకపోవడం గమనార్హం.

ఆయన ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తులను కోరుకుంటున్నారు. ఆ విధంగా జరగాలని తాను ఉన్న బీజేపీ పార్టీలో పెద్దల వద్ద వత్తిడి తెస్తున్నారని అంటున్నారు. ఏపీ బీజేపీకి ఇపుడు నాయకుల కొరత ఉంది. దాని కంటే ముందు అంగబలం అర్ధ బలం ఉన్న వారి అవసరం ఉంది. వాటిని పూర్తిగా తీరుస్తున్న సీఎం రమేష్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఏమిటి తప్పు అన్న చర్చ కూడా వస్తోంది.

కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ హై కమాండ్ రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి పదవులు ఇస్తుందని తాజాగా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. తెలంగాణా నుంచి బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఏపీలో చూసుకుంటే ఈ మధ్య పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్న సీఎం రమేష్ కి ఈ పదవి ఇస్తారా అన్న టాక్ అయితే ఉంది.

ఇక బీజేపీకి ఎంతో మంది నాయకులు ఉన్నారు పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉన్న వారు ఉన్నారు. అయినా సరే తానే అసలైన బీజేపీ నేత అన్నట్లుగా సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. కేంద్ర నాయకత్వం కూడా ఏపీలో ఏదో విధంగా బలపడాలీ అంటే సౌండ్ పార్టీ నాయకులను ముందు పెడుతోందని అంటున్నారు. అలా ఏ విధంగా చూసుకున్నా సీఎం రమేష్ ఇపుడు ఏపీ బీజేపీలో హాట్ టాపిక్ గా ఉన్నారు.

విశాఖలో అమిత్ ష సభ ఏర్పాట్ల బాధ్యతలను ఆయన చూస్తున్నారు అంటే కేంద్ర పెద్దల ఆశీస్సులు ఆయన మీద ఉన్నాయని అంటున్నారు. దాంతో టీడీపీతో బీజేపీ పొత్తులు పెట్టుకోవాలన్న ఆలోచనలు కనుక ఉంటే వారధిగా ఉండేందుకు సీఎం రమేష్ వంటి వారిని కీలకంగా ఏపీ పాలిటిక్స్ లో చేయవచ్చు అని అంటున్నారు. పైగా జగన్ సొంత ప్రాంతం అయిన రాయలసీమకు చెందిన రమేష్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తే కాషాయం పార్టీ జాతకం ఆ ప్రాంతంలో మారుతుంది అని ఆశిస్తున్నారుట. ఏది ఏమైనా బీజేపీలో అసలు నాయకుల కంటే కొసరు నాయకులకే అంతా బాగుంది అని అంటున్నారు.