Begin typing your search above and press return to search.

ఈ కొరతను తీర్చేశారు.. విమానం మోత మోగిందోచ్!

By:  Tupaki Desk   |   14 Aug 2021 1:00 PM IST
ఈ కొరతను తీర్చేశారు.. విమానం మోత మోగిందోచ్!
X
అంతకంతకూ పెరిగే పెట్రోల్.. డీజిల్ ధరలు.. దీనికి ఏ మాత్రం తీసిపోని రీతిలో పెరిగే నిత్యవసర వస్తువుల ధరలు.. ప్రతి వస్తువు మీదా.. వస్తుసేవ మీద మోత మోగించేలా జీఎస్టీ.. వెరసి సగటుజీవి ఉక్కిరిబిక్కిరి అయ్యే వేళలో.. తాజాగా మరో మోత మోగిందే. గడిచిన కొద్దికాలంగా మధ్యతరగతి జీవికి అందుబాటులోకి వచ్చిన విమాన ఛార్జీలు తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మోత మోగినట్లే. కొవిడ్ కాలంలో నష్టాల పాలైన విమానయాన సంస్థల్ని ఆదుకునేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మే నెలలో పెంచిన పరిమితికి తాజాగా మరింత పెంచటంతో టికెట్ ధరలు మరింతగా పెరగనున్నాయి.

కొవిడ్ కారణంగా విమానయాన సంస్థలకే కాదు.. ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు పెరిగాయి. సగటుజీవి గురించి ఆలోచించని సర్కారు.. విమానయాన సంస్థల గురించి మాత్రమే ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు ఎలా తగలడతాయన్న దానికి నిదర్శనంగా తాజా నిర్ణయం ఉందన్న మాట వినిపిస్తోంది. మొన్నటివరకు రూ.3300 వరకు ఉన్న ఛార్జీలు తాజాగా తీసుకున్న నిర్ణయంతో రూ.3900 వరకు పెరగనున్నాయి.

గతంలో హైదరాబాద్ - బెంగళూరుకు కనిష్ఠంగా రూ.1800 మాత్రమే టికెట్ ధర ఉండేది. ఇప్పుడు మారిన పరిస్థితులతో రూ.4000 నుంచి రూ.4500 వరకు పెరిగే వీలుందని చెబుతున్నారు. అంటే.. గతంలో రానుపోను అయ్యే ఛార్జీ కాస్తా.. ఇప్పుడు ఒకవైపు ప్రయాణానికే అవుతుందన్న మాట. తాజాగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో కొత్త ధరలు తెర మీదకు రానున్నాయి.

కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ‘మే’ నుంచి దేశీయ విమానయానం మళ్లీ మొదలైంది. కొవిడ్ కారణంగా నష్టాల్లో మునిగిన సంస్థల్ని ఆదుకునేందుకు పౌరవిమానయాన శాఖ కనిష్ఠ పరిమితులను విధించింది. అదే సమయంలో ప్రయాణికులకు వెసులుబాటు ఇస్తూ గరిష్ఠ పరిమితిని కూడా విధించింది. గతంలో 40 నిమిషాల్లోపు ప్రయాణ సమయం ఉన్న గమ్యస్థానాలకు ఇప్పటివరకు ఉన్న పరిమితుల కారణంగా రూ.2600 వరకు ఉండేది. అదిప్పుడు రూ.2900కు చేరుకుంది. ఇదే కేటగిరిలో గరిష్ఠ పరిమితి 12.82 శాతం పెంపుతో అది కాస్తా రూ.8800లకు చేరుకోనుంది.

జర్నీ టైం పాత కనిష్ఠ పరిమితి కొత్త కనిష్ఠ పరిమితి
40 నిమిషాల్లోపు రూ.2600 రూ.2900
40-60 నిమిషాల్లోపు రూ.3300 రూ.3700
60-90 నిమిషాల్లోపు రూ.3900 రూ.4500
90-120 నిమిషాల్లోపు రూ.4700 రూ.5300

ఈ కనిష్ఠ ఛార్జీలకు గరిష్ఠ పరిమితి కూడా ఉంది. ఉదాహరణకు 40 నిమిషాల్లోపు జర్నీకి కనిష్ఠ ఛార్జీ రూ.2900 ఉంటే.. గరిష్ఠ ఛార్జీ రూ.8800 వరకు ఉండే వీలుంది. అదే సమయంలో 40-60 నిమిషాల్లోపు జర్నీ గరిష్ఠ ఛార్జీ రూ.11000 ఉండనుంది. 60-90 నిమిషాల జర్నీకి గరిష్ఠ పరిమితి రూ.13,200 వరకు పెంచుకునే వీలుంది. పెరిగిన గరిష్ఠ పరిమితితో పోలిస్తే కనిష్ఠ ఛార్జీలో తేడా తక్కువనే చెప్పాలి. గరిష్ఠ పరిమితి విషయంలో పాత పద్దతినే అనుసరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిది పెంచటమో.. పెరిగిపోవటమో అయితే సగటు జీవి బతుకుపై కొత్త సందేహాలు ఖాయమని చెప్పక తప్పదు.