Begin typing your search above and press return to search.

పోల‌వ‌రంపై కేంద్రం క‌నిక‌రిస్తుందా?

By:  Tupaki Desk   |   3 July 2018 1:37 PM GMT
పోల‌వ‌రంపై కేంద్రం క‌నిక‌రిస్తుందా?
X
ఆంధ్రప్రదేశ్ కు జీవ‌నాడి వంటి పోలవ‌రం ప్రాజెక్టు ప‌నులు గ‌త నాలుగేళ్లుగా న‌త్త‌న‌డ‌క‌న సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. బీజేపీతో నాలుగేళ్ల‌పాటు అంట‌కాగిన టీడీపీ....ఆ ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫ‌ల‌మైంది. త‌మ లోపాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు నిధుల విడుద‌ల గురించి కేంద్రంపై చంద్ర‌బాబు ఒత్తిడి చేయ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకోవ‌డంతో ప్ర‌స్తుతం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి నిధులు అంద‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా పోల‌వ‌రంపై చంద్ర‌బాబు స‌ర్కార్ కు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పోల‌వ‌రానికి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ర‌ద్దు చేయ‌డంపై విధించిన స్టే గ‌డువు సోమ‌వారంతో ముగిసింది. అయితే, తాజాగా ఈ స్టే గ‌డువును మ‌రో ఏడాది పెంచేందుకు కేంద్రం సుముఖంగా లేద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి.

వాస్త‌వానికి పోల‌వ‌రం ప్రాజెక్టుకు 2005లోనే ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూర‌య్యాయి. అయితే, ఒడిశా ప్ర‌భుత్వం అభ్య‌ర్థ‌న ప్ర‌కారం వాటిని నేష‌న‌ల్ ఎన్విరాన్ మెంటల్ అప్పీలేట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, 2014లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ ఆదేశాల‌పై కేంద్రం స్టే విధించింది. ఏడాదికోసారి ఆ స్టేను పొడిగిస్తూ వ‌చ్చింది. తాజాగా, జూలై 2 - 2018 నాటికి ఆ స్టే గ‌డువు ముగిసింది. అయితే, టీడీపీతో తెగ‌దెంపుల నేప‌థ్యంలో మ‌రో ఏడాది పాటు ఆ స్టేను పొడిగించేందుకు కేంద్రం సుముఖంగా లేద‌ని తెలుస్తోంది. దానికి తోడుగా....ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కొద్ది రోజుల క్రితం షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనులు తక్షణమే నిలిపివేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ కు న‌వీన్‌ పట్నాయక్‌ లేఖ రాశారు. ఆ ప్రాజెక్టు వ‌ల్ల ఒడిశా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోబోతోంద‌ని - వాటిని ప‌రిష్కరించిన త‌ర్వాతే నిర్మాణ ప‌నుల‌కు అనుమ‌తినివ్వాల‌ని న‌వీన్ ప‌ట్నాయ‌క్ కోరారు. ముంపు - పునరావాసం త‌దిత‌ర అంశాలపై స్ప‌ష్ట‌త వ‌చ్చేవ‌ర‌కు పనులను కొనసాగించవ‌ద్ద‌ని లేఖలో కోరారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే కొన్ని ప్రాంతాల‌ను ఒడిశావాసులు శాశ్వతంగా నష్టపోతారని పేర్కొన్నారు. గతంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోల‌వ‌రం అంశంపై న‌వీన్ ప‌ట్నాయ‌క్ రెండు సార్లు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ స్టేపై కేంద్రం వైఖ‌రి తెలియాలంటే....ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్థ‌న్ వ‌చ్చేవ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.