Begin typing your search above and press return to search.

తెలంగాణకూ హ్యండ్ ఇచ్చిన మోడీ సర్కారు

By:  Tupaki Desk   |   5 May 2016 11:27 AM IST
తెలంగాణకూ హ్యండ్ ఇచ్చిన మోడీ సర్కారు
X
ఏపీకి ప్రాణాధారంగా భావిస్తున్న ప్రత్యేక హోదా విషయంలో ద్రోహం చేసిన మోడీ సర్కారు.. తెలంగాణను కూడా వదల్లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణకు చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయంలో హ్యాండ్ ఇచ్చేయటం గమనార్హం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడింది. అయితే.. దీనికి పెద్ద ప్రచారం లభించలేదు.

విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్లాంట్ నెలకొల్పటం ఆర్థికంగా అనుకూలం కాదని తేల్చేసిన కేంద్ర సర్కారు.. మరికొన్ని అంశాల్లో హ్యాండ్ ఇచ్చేసిన విషయాన్ని లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించటం గమనార్హం. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన స్టీల్ ప్రాజెక్టుతో పాటు.. తెలంగాణకు కేటాయించాల్సిన తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించటం సాధ్యం కాదని తేల్చేశారు.

కొత్త రైలుకు వనరులు.. కార్యకలాపాలు సహకరించబోవని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేయటం గమనార్హం. వనరుల లభ్యత.. ట్రాఫిక్ డిమాండ్ లాంటి అంశాల విషయంలో కలిసి వచ్చేలా ఉంటేనే సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ విషయాన్ని పరిశీలిస్తామంటూ మెలిక పెట్టటం ద్వారా.. విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే అంశాల పట్ల తనకు పెద్ద ఆసక్తి లేదన్న విషయాన్ని తేల్చి చెప్పినట్లుగా భావించాలి. తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే పెడబొబ్బలు పెట్టే కేసీఆర్ సర్కారు.. విభజన చట్టంలో ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం హ్యాండ్ ఇచ్చినా కిక్కురుమనకుండా ఉండటం ఏమిటి చెప్మా..?