Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల కోరికను కేంద్రం తీర్చనుందా?

By:  Tupaki Desk   |   29 Feb 2016 11:16 AM IST
చంద్రుళ్ల కోరికను కేంద్రం తీర్చనుందా?
X
ఏపీ - తెలంగాణల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ వర్గాల నుంచి ఇలాంటి నమ్మకం కనిపిస్తోంది. అయితే... కేంద్రం తీరు తెలిసినవారు మాత్రం పూర్తిస్థాయిలో విశ్వసించడంలేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ జరిపేందుకు కేంద్రం కసరత్తు జరుపుతోందని సమాచారం. దీనికి సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారని సమాచారం. సప్లిమెంటరీ అజెండాతో బిల్లు ఆమోదించడం ద్వారా 2019 ఎన్నికలకు అసెంబ్లి సీట్ల సంఖ్యను విభజన చట్టం ప్రకారం పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కార్‌ పంపిన ప్రతిపాదన లతో ఆంధ్రప్రదేశ్‌ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవటంతో 9 సిట్టింగ్‌ లలో ప్రక్రియ పూర్తిచేసేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఇప్పటి వరకు కేంద్ర న్యాయశాఖ నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి విరుద్ధమైన ప్రకటనలు చేసింది. ఇటీవల కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు దీనిపై స్పష్టత ఇచ్చారు. ఇంతకు ముందు 2025 వరకు డీలిమిటేషన్‌ కష్టసాధ్యమవుతుందని భావించారు.

ఇతర రాష్ట్రాల ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకుని ఈ రకమైన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఏపీ - తెలంగాణతో పాటు వివిధ ఈశాన్య - ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంచాలనే డిమాండ్‌ లు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రాలపై ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌ ను దేశం మొత్తంగా కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం 2019 ఎన్నికలలోగా డీలిమిటేషన్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఈలోగా కులగణన సర్వేతో పాటు నియోజకవర్గాల భౌగోళిక - నైసర్గిక పరిస్థితులపై ఎన్నికల సంఘానికి సమాచారం అందించాల్సి ఉంది.

2011 జనాభా ప్రాతి పదికన సర్వే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో పునర్‌ వ్యవ స్థీకరణ ప్రక్రియ పూర్తయింది. విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో మరోసారి ఈ ప్రక్రియ అనివార్యమైంది. విభజనకు ముందు 294 సీట్లలో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగలేదు. ఎస్సీ - ఎస్టీ రిజర్వేషన్లలో మాత్రం జనాభా దామాషా ప్రకారం స్వల్ప మార్పులు జరిగాయి.

విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ 175 - తెలంగాణ 119 శాసనసభ స్థానాలను పొందాయి. చట్ట ప్రకారం ఏపీలో 50 సీట్లకు పెంచాలి అంటే 225 స్థానాలుగా - తెలంగాణలో 34 స్థానాలు అదనంగా 153 సెగ్మెంట్‌ లుగా పునర్‌వ్యవస్థీకరణ జరపాలి. ఎస్సీ - ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ లో 175 సీట్లకు గాను 29 ఎస్సీ, 7 ఎస్టీలకు రిజర్వు కాగా, తెలంగాణలో 119 సీట్లకు గాను 17 ఎస్సీ, 12 ఎస్టీలకు రిజర్వయ్యాయి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా, పెరిగిన సీట్ల ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల స్థానాలు మరిన్ని పెరుగుతాయి.

ఈ బిల్లుకు మద్దతివ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపీలకు సూచించారు. నియోజకవర్గాల పునర్య్వ స్థీకరణ జరిగితే పార్టీకే బలమని వివరించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీలో వచ్చే ఎన్నికల్లో తమ భవితవ్యంపై తగిన హామీ తీసుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. దీంతో 50 సీట్లు పెరిగితే ఇటు ఇంటిపోరు తీర్చడంతో పాటు వలసలకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌ బిల్లుకు ఓకే చెప్పాలని ఆదివారం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం ఆదేశించారు.