Begin typing your search above and press return to search.

కేంద్రం రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసిందా?

By:  Tupaki Desk   |   26 Jun 2015 4:21 AM GMT
కేంద్రం రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసిందా?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు అంశాలకు సంబంధించి ఏం చేయాలి..? ఎలా వ్యవహరించాలి? ఎలాంటి పరిస్థితులకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి వీలుగా కేంద్రం ఒక రోడ్‌ మ్యాప్‌ని సిద్ధంగా చేసిందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం లభిస్తోంది.

ఓటుకు నోటు వ్యవహారంతో తీవ్రస్థాయికి వెళ్లిన రెండు రాష్ట్రాల మధ్య లల్లి.. అనంతరం సెక్షన్‌ 8 తదితర అంశాల వరకూ వెళ్లటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెక్షన్‌ 8పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టుదలగా ఉండటం కనిపిస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షన్‌ 8ని హైదరాబాద్‌లో అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుబడుతుంటే.. అలాంటి పరిస్థితే ఏర్పడితే.. తమ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గవర్నర్‌ను కలిసి మరీ హెచ్చరించటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య లడాయి మరింత తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో.. వీటన్నింటికి పరిష్కారం దిశగా కసరత్తు చేసిన కేంద్రం.. ఓటుకునోటు వ్యవహారంలోనూ.. సెక్షన్‌ 8 అమలు విషయంలోనూ ఏం చేయాలన్న అంశంపై మార్గదర్శనం చేస్తారన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకూ జరిగిన సమావేశాలకు భిన్నమైనదిగా పలువురు అభివర్ణిస్తున్నారు.

రెండు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు.. తాజా భేటీలో జరుగుతాయని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో వ్యవహరించాల్సిన వైఖరిపై గవర్నర్‌కు దిశానిర్దేశం చేస్తారన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న పలు అంశాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధం చేసిన రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా గవర్నర్‌ను వ్యవహరించాలని కోరుతారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.