Begin typing your search above and press return to search.

రైల్వో జోన్‌ పై మ‌రో ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   20 Feb 2018 6:17 AM GMT
రైల్వో జోన్‌ పై మ‌రో ట్విస్ట్‌
X
ఏపీకి రైల్వేజోన్‌ పై ప‌రిష్కారం కంటే చిక్కుముడులే ఎక్కువ ప‌డుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌రిష్క‌రించాల్సిన కేంద్రం మ‌రింత జ‌ఠిలం చేసేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. దీనికి కొన‌సాగింపుగా పొరుగు రాష్ట్రమైన ఒడిశా తీరు ఆస‌క్తిగా మారింది. ఏపీకి జోన్ ప్రకటించాలంటూనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. `కొత్తగా ఏర్పడిన ఏపీకి రైల్వే జోన్ ఇచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఒడిశా రాష్ట్రానికి చెందిన తూర్పుకోస్తా రైల్వేలో భాగమైన వాల్తేరు డివిజన్ విభజన మా ఆమోదం లేకుండా ఎలా సాధ్యం. ఒడిశాలో మూడు కొత్త రైల్వే డివిజన్లు కావాలని మూడేళ్లుగా కోరుతున్నాం. రైల్వే పరంగా మా అభ్యర్థనలు మన్నించిన మీదటే వారికి జోన్ ఇవ్వకండి` అని ష‌ర‌తులు విధించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఒడిశా ఫిర్యాదుపై ఆస‌క్తిక‌ర చ‌ర్య‌చ జ‌రుగుతోంది. ఆగ్నేయ రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ ను 2003లో విడదీసి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటు చేశారు. ఒడిశాలోని ఖుర్దారోడ్‌ తో పాటు ఏపీలోని వాల్తేరు - ఇంకో రాష్ట్రంలోని సంబల్‌పూర్ డివిజన్‌ లతో కలిపి కొత్త జోన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తూర్పుకోస్తా రైల్వేకి వాల్తేరు డివిజన్ ప్రధాన ఆదాయ వనరు. ఈ తరుణంలో వాల్తేరు డివిజన్‌ ను ఏపీకి కేటాయిస్తే - తూర్పుకోస్తా జోన్ నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్‌ లో భాగంగా ఉన్న జగదల్‌ పూర్ - కిరండూల్ - కోరాపుట్ - నవరంగ్‌ పూర్ ప్రాంతాలను విడదీసి తాము మూడేళ్లుగా అడుగుతున్న రూర్కెలా - జైపూర్ - రాయగడ డివిజన్లుగా ఏర్పాటు చేయాలన్నది ఒడిశా వాదన.అయితే, ఈసారి బడ్జెట్‌ లో కేంద్రం నుంచి రైల్వే పరంగా తాము రూ.3,160 కోట్ల రూపాయల నిధులు కోరితే, కేవలం రూ.1,420 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించడాన్ని ఒడిశా ప్రభుత్వం ప్రస్తావించింది.

ఇదిలాఉండగా తాజా ప‌రిణామంపై కొంద‌రు కేంద్ర ప్ర‌భుత్వాన్ని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఒక ప్రతిపాదన రైల్వే మంత్రిత్వ శాఖ ముందుంచినట్టు సమాచారం. వాల్తేరు డివిజన్‌ లో భాగంగా ఉన్న ఒడిశా ప్రాంతాన్ని మినహాయించి - విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనికి స్పందనగానే ఒడిశా నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఈ అంశాన్ని మరింత జఠిలం చేయడం ద్వారా ఇప్పట్లో పరిష్కారానికి అవకాశం లేకుండా చూసే ధోరణిలో కేంద్రం వెళ్తున్నట్టు రాష్ట్ర రాజకీయ పార్టీల అనుమానం. ఒడిశా ప్రభుత్వం కోరుతున్నట్టు ఒడిశాలో కొత్తగా మూడు డివిజన్లు ఏర్పాటు చేయాలంటే తూర్పుకోస్తాతో పాటు ఆగ్నేయ రైల్వే - ఆగ్నేయ మధ్య రైల్వేలను పునర్విభజించాలి. అంటే మూడు జోన్లను అస్థిర పరచడంకంటే యథాతథ స్థితిని కొనసాగించడమే మంచిదన్న ఉద్దేశంతో కేంద్రం రైల్వేజోన్ అంశాన్ని సాగదీస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.