Begin typing your search above and press return to search.

అమరావతి మార్పుపై కేంద్రం జోక్యం చేసుకుంటుందా?

By:  Tupaki Desk   |   20 Dec 2019 2:30 PM GMT
అమరావతి మార్పుపై కేంద్రం జోక్యం చేసుకుంటుందా?
X
ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమంటూ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో వివాదం చెలరేగింది. టీడీపీ దీన్ని తీవ్ర వ్యతిరేకిస్తోంది. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఆందోళనలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీని కోరేందుకు ఢిల్లీకి రాజధాని రైతులు వెళుతున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రైతులకు మద్దతుగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా మాట్లాడారు. ‘అమరావతిని మార్చడం సులభం కాదు.. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారదని.. వైసీపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు మారిస్తే కేంద్రంలోని బీజేపీ మౌనంగా ఉండదంటూ సుజనా చౌదరి ట్వీట్ చేశారు.

అయితే ఇదే విషయంపై స్పందించిన బీజేపీ మరో సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు రాజధాని నిర్మాణం, వికేంద్రీకరణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విషయమన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.

ఇక ఈ వివాదంపై అధికార వైసీపీ స్పందించింది. అమరావతిని చంద్రబాబు తాత్కాలిక రాజధాని మాత్రమే అన్నారని.. తాము కూడా తాత్కాలిక రాజధానిగానే భావిస్తున్నామని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. మూడు రాజధానులు కాకుంటే ఏకంగా 30 రాజధానులు పెట్టుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే వారు ఇచ్చిన రాజధాని భూములు తిరిగి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. విశాఖపట్నం అభివృద్ధి చెందిన నగరం అని, కొనడానికి భూమి అవసరం లేదని పెద్దిరెడ్డి అన్నారు.

దీంతో ఈ విషయంలో మోడీ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది. జగన్ నిర్ణయానికి సపోర్టు చేస్తారా? లేక టీడీపీ చేస్తున్న రాద్ధాంతానికి అనువుగా స్పందిస్తాడా అన్నది వేచిచూడాలి.