Begin typing your search above and press return to search.

డ్రాగన్ కు కేంద్రం సీరియస్ వార్నింగ్

By:  Tupaki Desk   |   16 Oct 2020 12:45 PM IST
డ్రాగన్ కు కేంద్రం సీరియస్ వార్నింగ్
X
డ్రాగన్ పాలకులకు కేంద్రప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అనవసరంగా తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదంటూ ఘాటుగానే హెచ్చిరికలు జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు లడ్డాఖ్ ఎప్పటికీ తమ దేశంలోని అంతర్భాగాలే అంటూ తీవ్రంగా చెప్పేసింది. ఈమధ్య చైనా పాలకులు మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ కు భారత్ కు సంబంధం లేదని, అలాగే లడ్డాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా తాము గుర్తించటం లేదంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఇదే విషయమై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్, లడ్డాఖ్ కు చైనా గుర్తింపు ఎందుకంటే నిలదీశారు. అరుణాచల్ ప్రదేశ్, లడ్డాఖ్ తమ దేశంలోని ప్రాంతాలుగా గుర్తించాలని భారత్ ఎప్పడూ చైనాను కోరలేదన్నారు. ఎందుకంటే చైనా గుర్తించినా గుర్తించకపోయినా పై రెండు ప్రాంతాలో నూరుశాతం భారత్ లో అంతర్భూభాగాలే అన్న విషయా యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. అనవసరంగా పై ప్రాంతాల్లో డ్రాగన్ జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని కూడా తీవ్రంగా హెచ్చరించటం సంచలనంగా మారింది.

అరుణాచల్ ప్రదేశ్ ను ఎలాగైనా కబ్జా చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఆ రాష్ట్రం సరిహద్దుల్లో చాలా కాలంగా చైనా తన సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించింది. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో డ్రాగన్ సైన్యం అనవసరంగా చికాకులు కలిగిస్తున్నారు. ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని తమ దేశంలో కలిపేసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే డ్రాగన్ కుట్రలకు తెరలేపింది. ఈ తలనొప్పిని తట్టుకునేందుకు భారత్ కూడా భారీ ఎత్తున సైన్యాన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో మోహరించింది.

ఏదో రూపంలో చికాకులు సృష్టించటం భారత్ లో అంతర్గతంగా కల్లోలం రేపటమే వ్యూహంగా చైనా పాలకులు పావులు కదుపుతున్న విషయా యావత్ ప్రపంచం గుర్తించింది. ఇందులో భాగంగానే జమ్మూ-కాశ్మీర్ లో కూడా లడ్డాఖ్ ప్రాంతం, ప్యాంగ్యాంగ్, గాల్వాన్ లోయలోను వరుసపెట్టి చికాకులు కలిగిస్తోంది. ఎక్కడికక్కడ మన సైనికులు ప్రత్యర్ధులకు గట్టి సమాధానాలు చెబుతుండటాన్నే చైనా పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు ముందు ఇంకెన్ని చికాకులు సృష్టిస్తుందో చూడాల్సిందే.