Begin typing your search above and press return to search.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పై కేంద్రం స్పష్టత...రాష్ట్రాలకు కీలక గైడ్‌లైన్స్ !

By:  Tupaki Desk   |   30 April 2021 6:34 AM GMT
దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పై కేంద్రం స్పష్టత...రాష్ట్రాలకు కీలక గైడ్‌లైన్స్ !
X
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతుంది. వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. కరోనా ను కట్టడిలోకి తీసుకురావడానికి పలు రాష్ట్రాలు కరోనా కర్ఫ్యూలు, లాక్‌ డౌన్‌ లు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌ డౌన్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. మే 2 తర్వాత కేంద్రం లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేయబోతుంది అంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే, కేంద్ర హోం శాఖ తాజాగా వెల్లడించిన కోవిడ్ మార్గదర్శకాలతో అలాంటిదేం లేదని తేటతెల్లం అవుతుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోం శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో వెలువరించిన మార్గదర్శకాలను మే 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.

ఏప్రిల్ 25న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సలహా ప్రకారం ఈ రోజు జారీచేసిన ఉత్తర్వుల్లో కంటెయిన్‌ మెంట్ చర్యలను పరిగణనలోకి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తున్నాం అని తెలిపింది. కరోనా పరిస్థితిని అంచనా వేయడం ద్వారా తక్షణమే అమలు చేయాలి. విపత్తు నిర్వహణ చట్టం- 2005 నిబంధనల ప్రకారం.. అవసరమైన నియంత్రణ చర్యలను అమలు చేయాలని రాష్ట్రాలు, యూటీలను కోరుతున్నాం అని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. కేంద్ర హోంశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం.. గత వారం రోజులుగా కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువ ఉన్న జిల్లాలను రాష్ట్రాలు గుర్తించాలి. అలాగే, 60 శాతం కంటే ఎక్కువ పడకలు నిండిన ప్రాంతాలను గుర్తించాలి, ఏదైనా జిల్లాలో ఈ రెండు పరిస్థితులు ఉంటే జిల్లాలో స్థానిక నియంత్రణ చర్యలను చేపట్టాలి అని హోం మంత్రిత్వ శాఖ సూచించింది.

ఇక దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు రోజురోజుకి భారీగా పెరుగుతుంది. నిన్న‌ కొత్త‌గా 3,86,452 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,97,540 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 3,498 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,08,330కు పెరిగింది. వరుసగా మూడో రోజు కోవిడ్ మరణాలు మూడు వేలు దాటాయి. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,53,84,418 మంది కోలుకున్నారు.