Begin typing your search above and press return to search.

వైసీపీ అప్పులు డబుల్...రుణాంధ్ర ప్రదేశ్ గానే

By:  Tupaki Desk   |   7 Feb 2023 5:54 PM GMT
వైసీపీ అప్పులు డబుల్...రుణాంధ్ర ప్రదేశ్ గానే
X
ఏపీ అప్పులు డబుల్ అయ్యాయి. అయితే ఎవరి గుండె గుబేల్ మన్నా ఈ రుణ భారం అలా కొనసాగి తీరాల్సిందే అంటున్నారు. ఏపీలో అప్పులు అక్షరాలా 4,42,442 కోట్ల రూపాయలు అని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఈ రోజు చెప్పారు. అప్పు చేయడంతో గత ప్రభుత్వం రికార్డులను ప్రస్తుత ప్రభుత్వం దాటేసింది అని ఆయన చెప్పిన దాని బట్టి అర్ధం అవుతోంది.

ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేంతవరకూ చేసిన అప్పు తీసుకుంటే 2019లో రూ.2,64, 451 కోట్లు ఉండగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హయాంలో 2020 లో రూ.3,07, 671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022 లో రూ.3,93,718 కోట్లు అప్పులు పెరిగాయి. ఇక 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరిందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ లెక్కన చూస్తే 2019లో ఉన్న 2.64 లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం రూ.4.42 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

అయితే ఇదంతా ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో చూపించిన మేరకు చేసిన అప్పుగా చెబుతున్నారు. ఈ అప్పు కాకుండా వివిధ కార్పోరేషన్ల ద్వారా చేసిన అప్పు ఇంతకు రెట్టింపు ఉంటుందని అంటున్నారు. అలాగే ఆస్తుల తాకట్టు ద్వారా ఏపీకి వచ్చే మద్యం తదితర ఆదాయలను లెక్క కట్టి తెచ్చిన అప్పులు ఇలా అనేక సోర్సుల ద్వారా చేసిన అప్పులు చూస్తే కచ్చితంగా పది లక్షల కోట్లకు అప్పు చేరుకునే అవకాశం ఉంది అని అంటున్నారు

ఏపీ అప్పుల కుప్ప అని ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దానికి కేంద్రం ఇచ్చిన వివరాలు చూస్తే ఏపీ అప్పులతో ఎక్కడికి వెళ్తోంది అని అనిపించక మానదు. ఏపీకి వేరే ఆదాయ మార్గాలు లేకుండా పోయాయని అంటున్నారు. దాంతో పాటు అతి ఖర్చుతో కూడుకున్న సంక్షేమ పధకాలను అమలు చేయడం వల్ల కూడా బడ్జెట్ కి మించి ఖర్చు అవుతోందని, దాంతో అప్పులు తేవడమే ఇక మిగిలింది అని అంటున్నారు.

ప్రభుత్వానికి ఏటా వచ్చే ఆదాయం అంతా లెక్క కట్టినా అప్పులు ప్రతీ ఏటా సగటున 45 వేల కోట్లు పై చిలుకు బడ్జెట్ లెక్కల మేరకు చేస్తున్నట్లుగా కేంద్రం అంచనా కడుతోంది. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా చేసే అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు అయిఏ ఇవ్వడం లేదు అని అంటున్నారు. అంటే ఇలా బహిర్గతం అయిన అప్పుల చిట్టాయే దాదాపుగా అయిదు లక్షల కోట్ల దాకా చేరుకుంటూంటే మరో అయిదు లక్షల కోట్ల రూపాయలు సులువుగా అప్పులు చేసి ఉంటారని అంటున్నారు.

మరి ఏపీ లాంటి పెద్దగా ఆదాయం లేని రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల అప్పులు కనుక ఉంటే వాటికి వడ్డీ ఎంత అవుతుంది. అసలు ఎప్పటికి ఈ అప్పులు తీరుతాయి. ఏపీ దాన్ని భరించగలదా అన్నదే చర్చగా ఉంది. ఇక ఈ అప్పులు ఇలా ఉండగానే ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో విన్నపం వెళ్ళిందని అంటున్నారు. జనవరి, ఫిబ్రవరి మార్చి నెలలకు గానూ పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు కోసం ఆర్బీఐని కోరుకుంటోంది. జనవరిలో ఏడు వేలు, ఫిబ్రవరిలో నాలుగు వేల కోట్లు, మార్చి లో వేయి కోట్లు అప్పుగా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

అంటే అప్పులు ఒక వైపు అలా సాగుతున్న ప్రభుత్వం మాత్రం కొత్త అప్పులకు సిద్ధపడుతూనే ఉంది అని అంటున్నారు. దీని వల్ల అప్పులు ఇంకా పెరుగుతాయని అంతా ఆందోళన పడుతున్నారు. అయినా నిండా మునిగాక చలి ఎందుకు అన్నట్లుగా అప్పులతోనే అప్టూ డేట్ గా ఉండాలని సర్కారీ పెద్దలు చూస్తున్నారు అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అన్నట్లు ఈ లెక్కలు అన్నీ కూడా టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ కోరిన మేరకు కేంద్ర మంత్రి రాజ్యసభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. ఇక తెలుగుదేశానికి పూర్తి అధికారిక వివరాలు దొరికాయి. వైసీపీని టార్గెట్ చేయడం ఖాయమనే అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.