Begin typing your search above and press return to search.

ఏపీ రాజధాని.. కేంద్రం జోక్యం చేసుకోగలదా?

By:  Tupaki Desk   |   25 Dec 2019 8:02 AM GMT
ఏపీ రాజధాని.. కేంద్రం జోక్యం చేసుకోగలదా?
X
ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన నుంచి టీడీపీ - రాజధాని రైతులు అగ్గి రాజేస్తున్నారు. అమరావతిలో శాసన రాజధానిని అలాగే ఉంచుతూ.. పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి - న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఈ నేపథ్యంలో అసలు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కుందా? కేంద్రంతో జగన్ ను నియంత్రించడం సాధ్యమా? రాజధాని మారకుండా ఆపే విషయంలో కేంద్రానికి అధికారముందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

కర్నూలుకు న్యాయరాజధానిని మార్చడాన్ని అమరావతిలో కొలువై ఉన్నహైకోర్టు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే వారు న్యాయపరమైన జోక్యానికి అవకాశం ఉందా అని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

ఇక రాజధాని రైతులు సైతం ఢిల్లీకి వెళ్లి కేంద్రంలోని ఉన్నతాధికారులను కలిశారు. వందలాది మంది రైతులు మంగళవారం ప్రధాని నరేంద్రమోడీకి స్పీడ్ పోస్టు ద్వారా లేఖ రాసి రాజధానిని మార్చకుండా అడ్డుకోవాలని కోరారు. ఇక రాజధాని రైతుల ధర్నాల్లో మోడీ బొమ్మ పెట్టి న్యాయం చేయించాలని బీజేపీ నేతలను కోరుతున్నారు.

మూడు రాజధానుల సమస్యపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయడానికి కేంద్రానికి ఏమైనా అధికారాలు ఉన్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిజానికి ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం.. రైతుల సమస్యపై నిజంగా మోడీ స్పందిస్తే జగన్ పిలిచి కేవలం దీన్ని విరమించుకోవాలని మాత్రమే చెప్పవచ్చు. అంతేకానీ గట్టిగా కోరడానికి ఆస్కారం లేదని చెబుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమైన రాజధాని మార్పుల విషయంలో కేంద్రానికి ఎలాంటి అధికారం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.