Begin typing your search above and press return to search.

ప్రభుత్వ పథకాలకు భిక్షగాళ్ల ప్రచారం

By:  Tupaki Desk   |   9 Aug 2015 9:08 AM GMT
ప్రభుత్వ పథకాలకు భిక్షగాళ్ల ప్రచారం
X
'ధర్మం చెయ్యండి బాబూ.. ధర్మం చెయ్యండీ'... 'నడిపించు నా నావా.. న‌డిసంద్రమున దేవా..' అంటూ రకరకాల పాటలతో రైళ్లలో బస్టాండ్ల లో, రద్దీ ప్రాంతాల్లో పాటలు పాడుతూ యాచించుకునేవారిపై కేంద్రం కన్నేసింది. కేంద్రం కన్నేసిందంటే.. దేశంలో యాచన లేకుండా చేయాలనుకోవడమో.. లేదంటే వారి జీవితాలను బాగు చేయాలనుకోవడమో కాదు.. వారిని ఫుల్లుగా వాడుకోవడానికి ప్లాను వేస్తోంది. అవును... రకరకాల పాటలతో మతాలు - తత్వాలు - సంతోషాలు - బాధలు వినిపిస్తూ పదో పరకో యాచించే భిక్షకులకు సరికొత్త శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. వారు ప్రస్తుతం ఆలపిస్తున్న పాటల స్ధానంలో ప్రభుత్వ పథకాలను పాటలుగా పాడించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే 5 వేల మంది యాచకుల ఎంపిక చేసినట్లు సమాచారం.

మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ - బేటీ బచావో.. బేటీ పడావో - జన్ ధన్ యోజన తదితర పథకాలకు వినూత్న రీతిలో యాచ‌కుల‌తో ప్రచారం చేసేలా ప్రణాళిక‌లు సిద్ధం చేసింది. ఇప్పటికే గుర్తించిన 5 వేల మంది యాచకులకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. అతి త్వరలోనే మనం ఈ పాటలు ఏ ట్రైన్ లోనో , ఏ బ‌స్సు స్టాండ్ లోనో వింటామన్నమాట.

అయితే.. చాలాదేశాల్లో యాచన రద్దు చేయడం.. యాచకుల స్థితిగతులు మార్చేందుకు పథకాలు ప్రవేశపెడుతుంటే మనం మాత్రం యాచకుల గురించి ఆలోచించకుండా... వారు పడుతున్న ఇబ్బందులు.. వారు పెడుతున్న ఇబ్బందులు ఆలోచించకుండా ఇలా పథకాలకు ప్రచారానికి వారిని వాడుకోవడం మాత్రం సరిగా లేదు. అంతేకాదు... కేంద్రప్రభుత్వమే పథకాల నిర్వహణ కోసం అడుక్కుంటున్నట్లుగా కూడా ఎవరైనా అనుకునే ప్రమాదముంది.