Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను మాటతప్పేలా చేస్తోన్న మోడీ

By:  Tupaki Desk   |   27 Aug 2019 5:30 PM GMT
కేసీఆర్ ను మాటతప్పేలా చేస్తోన్న మోడీ
X
‘తెలంగాణలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కిన సందర్భాలు లేవు’... తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్న మాటలు ఇవీ. కాంగ్రెస్ హయాంలోలాగా రైతులు చెప్పులు పెట్టి యూరియా కోసం క్యూలైన్లో నిలుచున్న దాఖలాలు లేవు అంటూ కేసీఆర్ గొప్పగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది.

తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ తీసుకున్న చర్యల కారణంగా యూరియా కొరత వాటిల్లలేదు. ఖరీఫ్, రబీకి ముందే కేసీఆర్ యూరియాను కేంద్రం, వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసి నిల్వ చేసి రైతులకు సరిపడా పంచేవారు. తెలంగాణలో తొలి ప్రభుత్వంలో కేసీఆర్, మోడీ దోస్తీ కావడంతో కేంద్రం కూడా సరిపడా యూరియాను తెలంగాణకు అందించేది. కానీ ఇప్పుడలాంటి పరిస్థితులు లేవు.

రెండోసారి మోడీ, కేసీఆర్ గద్దెనెక్కాక గ్యాప్ పెరిగింది. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంతగా పెరిగిపోయింది. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం లేదు. దీంతోపాటు బీజేపీ కూడా తెలంగాణపై దండయాత్ర మొదలు పెట్టింది.

ఈ నేపథ్యంలో తెలంగాణకు యూరియా సరఫరాను తగ్గించేసిన కేంద్రం మహారాష్ట్ర- గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు చేస్తోందట.. ఇక యూరియా కంపెనీలన్నీ ఉత్తర భారతంలోనే ఎక్కువగా ఉండడంతో తెలంగాణ డిమాండ్ కు అనుగుణంగా అందడం లేదట..

ఓ వైపు కేంద్రం, మరోవైపు ఈసారి కాలం కావడంతో రైతులంతా పంటలు భారీగా వేశారు. దీంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్ తో తెలంగాణలో యూరియా కొరత ఏర్పడింది. కేసీఆర్ తో వైరం కారణంగా బీజేపీ కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. సరఫరా విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో తెలంగాణలో తొలిసారి కేసీఆర్ సర్కారు పాలనలో రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లాలో ఆందోళన చేశారు. బీజేపీతో చెడిన సంబంధాలు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.